‘ఎన్టీఆర్’ బయోపిక్ చివరి దశకు చేరుకుంది. ఈరోజు జరగాల్సిన సెన్సార్ అనివార్యకారణాల వల్ల వాయిదా పడింది. సోమవారం సెన్సార్ పూర్తయ్యే అవకాశం కనిపిస్తోంది. ఇన్సైడ్ వర్గాల సమాచారం ప్రకారం… నిర్మాతల విషయంలో క్రిష్ కాస్త అసంతృప్తితో ఉన్నాడని తెలుస్తోంది. క్రియేటీవ్ పరంగా క్రిష్ ఇచ్చిన, ఇస్తున్న సలహాలు ఏమాత్రం స్వీకరించడం లేదని తెలుస్తోంది. స్క్రిప్టు దశలోనే క్రిష్ చేతులు కట్టేశారని, అప్పటికే పూర్తయిన స్క్రిప్టుని యధాతథంగా తీయడం తప్ప ఈ సినిమా విషయంలోక్రిష్ చేసిందేం లేదని విశ్వసనీయ వర్గాలు చెబుతున్నాయి. పబ్లిసిటీ పరంగానూ క్రిష్ ఆలోచనలు ఏమాత్రం అమలుకావడం లేదట. ఈ సినిమాకి సంంధించి రోజుకో స్టిల్ బయటకు వస్తోంది. గెటప్పులన్నీ రివీల్ అయిపోతున్నాయి. ఇలా ముందే స్టిల్స్ బయటకు వచ్చేస్తే ఎలా? సినిమాలో చూడడానికీ చూపించడానికీ ఏముంటుందన్నది కొంతమంది వాదన. అదీ నిజమే. క్రిష్ కూడా ఇదే అభిప్రాయాన్ని బాలయ్య దగ్గర వ్యక్తం చేస్తున్నట్టు తెలుస్తోంది. కానీ.. బాలయ్య అవేం పట్టించుకోవడం లేదట. వీలైనన్ని ఎక్కువ స్టిల్స్ బయటకు వదలాలని, అప్పుడే ఏదో రకంగా జనాలు మాట్లాడుకుంటారని బాలయ్య చెబుతూ వచ్చాడట.
రెండు సినిమాలూ ఒకేసారి పూర్తి చేయాల్సిరావడం, రోజుకో కొత్త సీను తయారై స్క్రిప్టుతో జత కలవడం క్రిష్‌కి బాగా ఇబ్బందిగా పరిణమించిందని తెలుస్తోంది. ఎన్టీఆర్ బయోపిక్‌కి వీలైనంత త్వరగా ముగించి `మణికర్ణిక` ప్రమోషన్లలో పాల్గొనాలని క్రిష్ భావించాడని సమాచారం. కానీ.. ఆ అవకాశం కూడా లేకపోవడంతో క్రిష్నిరుత్సాహంగా ఉన్నాడట. ఒకవేళ `మణికర్ణిక` విజయవంతం అయినా ఆ క్రెడిట్ తనకు రాకుండా పోతుందేమో అని క్రిష్ భయపడుతున్నాడు. మరోవైపు పోస్ట్ ప్రొడక్షన్ పనుల్ని చక్కబెట్టుకునే బాధ్యత కూడా క్రిష్పైనే వదిలేసినట్టు తెలుస్తోంది. అటు డీఐ, ఇటు ఫైనల్ మిక్సింగ్ అంటూ క్రిష్ ఒక్కడే హడావుడి పడుతున్నాడని, ఈ విషయంలో తనకు సపోర్ట్ చేసే హ్యాండు లేదని ఇన్సైడ్ వర్గాలు చెబుతున్నాయి.