టాలీవుడ్లో ప్రతిభావంతుడైన దర్శకుడిగా పేరు తెచ్చుకొన్నాడు క్రిష్. కమర్షియల్ విజయాల మాట పక్కన పెడితే… క్రిష్ ప్రయత్నాలు ఎప్పుడూ విమర్శకుల మనసుల్ని గెలుచుకొన్నాయి. క్రిష్ అనగానే `కచ్చితంగా మంచి సినిమాలే తీస్తాడు` అనే నమ్మకం కలిగింది. ఇప్పుడిప్పుడే క్రిష్ పెద్ద హీరోల మనసుల్ని గెలుచుకొంటున్నాడు. నందమూరి బాలకృష్ణ 100వ సినిమాని చిరస్మరణీయంగా మలచిన తీరు ఎప్పటికీ మర్చిపోలేం. బాలయ్య సినిమా తరవాత… వెంకటేష్, చిరంజీవిలతో కలసి పనిచేసే అవకాశం వచ్చిందని భావించారంతా. వెంకీ సినిమా అనుకోకుండా ఆగిపోయింది. చిరుతో ప్రాజెక్ట్ ఇంకా చర్చల దశలో ఉంది. క్రిష్ ఈసారి కచ్చితంగా పెద్ద హీరోతోనే పనిచేస్తాడనుకొంటున్న తరుణంలో క్రిష్ తీసుకొన్న నిర్ణయం అందరినీ ఆశ్చర్యపరుస్తోంది.
ఇటీవల క్రిష్ కల్యాణ్ రామ్‌ని కలసి ఓ కథ వినిపించాడట. క్రిష్ అనగానే… కల్యాణ్ రామ్ మరో మాట చెప్పకుండా ‘యస్’ అంటాడని తెలుసు. ఎందుకంటే క్రిష్‌కి ఉన్న ఇమేజ్ అలాంటిది. మరోవైపు కల్యాణ్ రామ్ ఫ్లాపుల్లో ఉన్నాడు. క్రిష్ కథ చెప్పగానే మరో మాట లేకుండా ఓకే చెప్పేశాడని తెలుస్తోంది. అయితే.. ఇక్కడే ఓ ట్విస్ట్ ఉంది. క్రిష్ తన ప్రొడక్షన్ నుంచి సినిమాలు తీయాలని నిర్ణయించుకొన్నాడు. తన శిష్యుల సినిమాలను తాను నిర్మాతగా వ్యవహరిస్తాడన్నమాట. కథలు మాత్రం తాను అందిస్తాడు. శిష్యుడి సినిమా కోసం కల్యాణ్ రామ్‌ని కలిశాడా, లేదంటే క్రిష్ దర్శకత్వంలోనే ఈ సినిమా తెరకెక్కుతుందా?? అనే ఆసక్తి నెలకొంది. రెండిటిలో ఏదైనా సరే.. కల్యాణ్ రామ్ సరే అనక మానదు. మరి.. ఏం జరగబోతోందో చూడాలి.