ప్రభాస్ – కృష్ణవంశీ కాంబోలో వచ్చిన ‘చక్రం’ అప్పట్లో ఫ్లాప్ కావొచ్చు కానీ, ఆ సినిమా చాలా మందికి ఫేవరెట్. ప్రభాస్ ని ఓ కొత్త కోణంలో చూపించిన సినిమా అది. ప్రభాస్ కి ఆ సినిమా అంటే ఇప్పటికీ ఇష్టమే. ‘ఖడ్గం’ సూపర్ హిట్ తో ఫామ్ లో ఉన్న కృష్ణవంశీ.. అప్పట్లో ప్రభాస్ తో ఓ సినిమా చేయాలనుకొన్నారు. ఓ మాస్ కథ కూడా చెప్పారు. కానీ ప్రభాస్ మాత్రం ‘అందరూ మాస్ సినిమాలే చెబుతున్నారు. మీరు క్లాస్ కథ చెప్పండి’ అంటే… అలా ‘చక్రం’ కథ పుట్టింది. ఆ కాంబో సెట్స్‌పైకి వెళ్లింది. అప్పట్లో ప్రభాస్ కు చెప్పిన మాస్ కథ, ఇప్పటికీ అలానే ఉందట. అందులో ప్రభాస్ తప్ప మరెవ్వరూ సూట్ కారని కృష్ణవంశీ చెబుతున్నారు. ఒకవేళ… ప్రభాస్ గనుక అవకాశం ఇస్తే, ఆ కథని తనతో చేస్తానని, అయితే అది అంత ఈజీ కాదని చెబుతున్నారు కృష్ణవంశీ.
ప్రభాస్ బిజీగా ఉన్నాడు. ఇప్పుడు తన చేతుల్లో ఉన్న ప్రాజెక్టులన్నీ అయిపోయి, ఖాళీ అవ్వాలంటే కొన్నేళ్లు పడుతుంది. అప్పుడు కృష్ణవంశీతో చేసే మూడ్ ప్రభాస్‌కి ఉంటుందో, లేదో?! ఇదే మాట కృష్ణవంశీ కూడా అంగీకరించారు. ”నేను అనుకొన్న వెంటనే సినిమా మొదలెట్టేసే రకం. ప్రభాస్ తో సినిమా అంటే ఇప్పుడు అయ్యే వ్యవహారం కాదు. అందుకు చాలా ఏళ్లు ఎదురు చూడాలి” అంటూ క్లారిటీ ఇచ్చారు. ‘నిన్నే పెళ్లాడతా’ రీమేక్ గురించి కూడా కృష్ణవంశీ ఆసక్తికరమైన కామెంట్లు చేశారు. ఆ సినిమాని నాగచైతన్య లేదంటే అఖిల్ తో చేయొచ్చు కదా? అని అడిగితే… ”నిన్నే పెళ్లాడతా అనే సినిమా ఆల్రెడీ చేసేశాను. ఆ కథ చెప్పేశాను. ఇప్పుడు మళ్లీ కొత్త కథ రాసుకోవాలి. చైతూ బాడీ లాంగ్వేజ్ కి తగ్గ కథతో సినిమా తీయాలి. పాత సినిమాల్ని రీమేక్ చేయడంలో అంత మజా లేదు” అన్నారు. కృష్ణవంశీ దర్శకత్వం వహించిన ‘ఖడ్గం’ ఈనెల 18న రీ రిలీజ్ అవుతున్న సంగతి తెలిసిందే. ఇది వరకు ఆయన దర్శకత్వం వహించిన ‘మురారి’ రీ రిలీజ్ చేశారు. ఆ సినిమాకు మంచి వసూళ్లు వచ్చాయి. ఇప్పుడు ‘ఖడ్గం’ ఎలాంటి మ్యాజిక్ సృష్టిస్తుందో చూడాలి.