మారుతి… చిన్న సినిమాపై ఓ బ్రాండ్ వేసిన దర్శకుడు. ఈ రోజుల్లో తో.. చిన్న సినిమాల దృష్టి కోణాన్ని మార్చేశాడు. చిన్న సినిమాలతో కాసుల వర్షం కురిపించడం ఎలాగో చూపించాడు. ఈరోజుల్లో, బస్‌స్టాప్, ప్రేమ కథా చిత్రమ్ తరవాత… మారుతి బ్రాండ్ వాడుకొంటూ కొన్ని సినిమాలొచ్చాయి. ఆ సినిమాలకు డబ్బులు పెట్టుబడిగా పెట్టకపోయినా. తన బ్రాండ్ ఇమేజ్‌ని వాడుకోవడం వల్ల.. నిర్మాతగా మారాల్సివచ్చింది. తద్వారా బాగానే సంపాదించాడు కూడా. మారుతి ప్రొడక్షన్స్ నుంచి చిన్నా చితకా కలుపుకొని ఓ పది సినిమాలొచ్చుంటాయి. కొన్ని సినిమాలకు కథ, మాటలు కూడా అందించాడు. ఓ వైపు స్టార్లతో సినిమాలు చేస్తూ, చిన్న సినిమాల ద్వారా డబ్బులు సంపాదించుకొంటూ.. ఫుల్ జోష్ చూపించాడు. అయితే ఇప్పుడు ఓ షాకింగ్ నిర్ణయం తీసుకొన్నాడట మారుతి. ఇక మీదట చిన్న సినిమాలకు నిర్మాత ఉండకూడదని, ఎవ్వరికీ కథ, మాటలు ఇవ్వకూడదని డిసైడ్ అయ్యాడట.
ఇటీవల విడుదలైన రోజులు మారాయి.. సినిమా ఎఫెక్ట్ మారుతిపై మామూలుగా పడలేదు. ఈసినిమా చూశాక.. మారుతి పై పెరుగుతున్న పాజిటీవ్ ఒపీనియన్ రివర్స్‌గేర్‌లోకి వెళ్లడం మొదలైంది. డబ్బుల కోసం మరీ ఇంత కక్కుర్తి పడలా..? అన్నట్టు మారుతి బ్రాండ్‌పై బ్యాడ్ ఒపీనియన్ మొదలైపోయింది. దర్శకుడిగా ఒకొక్కమెట్టూ ఎక్కుతూ ఎందుకీ చిప్ ట్రిక్స్ అనిపించేలా తయారైంది… రోజులు మారాయి సినిమా. ఇలాంటి సినిమాలు ఒకట్రెండు మారుతి నుంచి బయటకు వస్తే.. దర్శకుడిగా ఆయన బ్రాండ్ దిగజారడం ఖాయం. అందుకే.. ఇక మీదట చిన్న సినిమాల్ని ప్రొడ్యూస్ చేయకూడదు.. అనే నిర్ణయానికి వచ్చాడట. తన కథ మరో దర్శకుడి చేతిలో పెట్టకూడదని డిసైడ్ అయ్యాడట. ఒక వేళ మరీ కథ అంతగా నచ్చితే.. తన పేరు వాడకుండా బినామీ పేర్లతోసినిమా తీయొచ్చని భావిస్తున్నాడట. ఇక మీదట చిన్న సినిమాలపై మారుతి సినిమా.. అనే బ్రాండ్ కనిపించకపోవొచ్చు. ఇక ఫుల్లుగా తన కాన్సట్రేషన్ డైరక్షన్ మీదే అన్నమాట.