నందినీ రెడ్డి తీసిన ‘అలా మొదలయింది’ సూపర్ హిట్ట్ అయినప్పుడు తెలుగు సినీ పరిశ్రమలో మళ్ళీ చాలా కాలం తరువాత ఒక మహిళా దర్శకురాలు వచ్చినందుకు అందరూ చాలా సంతోషించారు. ఆ తరువాత ఆమెకు అనేక పెద్ద నిర్మాతల దగ్గర నుండి ఆఫర్లు కూడా వచ్చేయి. కానీ ఆమె తన రెండవ సినిమా ‘జబర్దస్త్’ తో అంతకుముందు సంపాదించుకొన్న గొప్ప పేరు ప్రతిష్టలని మంట కలుపుకొన్నారు. హిందీలో సూపర్ హిట్ట్ అయిన ‘బ్యాండ్ బాజా బారత్’ అనే సినిమాను బాలీవుడ్ కి చెందిన యష్ రాజ్ సంస్థ తెలుగు, తమిళ బాషలో నిర్మించడానికి హక్కులు తీసుకొంది. కానీ, నందినీ రెడ్డి అదే సినిమాను కాస్త అటూ ఇటూ మార్చి ‘జబర్దస్త్’ అనే పేరుతో రిలీజ్ చేయడంతో ఆమెపై యష్ రాజ్ సంస్థ కోర్టులో కేసు వేసింది. ఆమె సినిమాకి ‘జబర్దస్త్’ టైటిల్ పెట్టినా సినిమా మాత్రం ఫ్లాప్ అయింది. ఒకవైపు కోర్టు కేసులు, మరొకవైపు రెండవ సినిమాయే ఫ్లాప్ అవడంతో ఆమె ఎంత వేగంగా పైకి దూసుకుపోయారో అంతే వేగంగా తన పేరు ప్రతిష్టలని పోగొట్టుకొన్నారు.
ఆ తరువాత ఆమె చాలా కాలం కనబడలేదు. మళ్ళీ కొన్ని నెలల తరువాత ‘కళ్యాణ వైభోగమే’ అనే టైటిల్ తో ఆమె ఒక కధ వ్రాసుకొని నాగ చైతన్య తదితర కుర్ర హీరోల చుట్టూ, కొంతమంది నిర్మాతల చుట్టూ తిరిగారు. కానీ ఎవరూ కూడా ఆమెతో సినిమా చేసేందుకు ఇష్టపడలేదు. చివరికి ఆమె మళ్ళీ తనకు మొట్టమొదట ‘అలా మొదలయింది’ సినిమాతో అవకాశం ఇచ్చిన నిర్మాత దామోదర్ ప్రసాద్ ని కలిసి ‘కళ్యాణవైభోగమే’ సినిమాకు ఒప్పించారు. ఆ సినిమా షూటింగ్ దాదాపు పూర్తి కావచ్చింది. కానీ ఇప్పుడు ఆ సినిమా కధ విషయంలో కూడా మరొక వివాదం మొదలయింది.
ప్రముఖ సినీ కధా రచయిత హనుమాన్ చౌదరి ఆ కధ తాను వ్రాసుకొన్నానని, దానిని నందినీ రెడ్డి కాపీ కొట్టి తన అనుమతి లేకుండా సినిమా తీస్తున్నారని సినీ రచయితల సంఘంలో పిర్యాదు చేసారు. తన కధను సినిమాగా తీస్తున్నారు కనుక తనకు రూ.25లక్షలు ప్రతిఫలం, సినిమాలో తనపేరు కూడా వేయాలని ఆయన వాదిస్తున్నారు. కానీ దర్శకురాలు నందినీ రెడ్డి కానీ నిర్మాత దామోదర్ ప్రసాద్ గానీ ఇంతవరకు దీనిపై స్పందించకుండా తమ సినిమాను వేగంగా పూర్తి చేస్తున్నారు.
కళ్యాణ వైభోగమే సినిమాలో నాగశౌర్య, మాళవిక నాయర్ హీరో, హీరోయిన్లుగా నటిస్తున్నారు. అలా మొదలయింది సినిమా తరువాత దామోదర్ ప్రసాద్ ‘అంతకు ముందు ఆ తరువాత’ అనే సినిమాను నిర్మించారు. ఆ తరువాత హోరాహోరీ అనే మరో సినిమాను కూడా నిర్మించారు. త్వరలో హోరాహోరీ, కళ్యాణ వైభోగం సినిమాలను విడుదల చేసేందుకు సన్నాహాలు చేసుకొంటున్నారు. కానీ ఈ ‘కళ్యాణ వైభోగం’ కోసం రచయిత హనుమాన్ చౌదరితో హోరాహోరీ యుద్ధం చేయక తప్పదేమో?
అయినా నందినీ రెడ్డి మొదటి సినిమాతోనే తన ప్రతిభని చాటుకొని ఇలాగ సినిమాలు, కధలు కాపీలు కొడుతూ చెడ్డ పేరు తెచ్చుకోవడం కంటే స్వంతంగా ఓ కధని తయారు చేసుకొని హిట్ ఇవ్వగలిగితే బాగుండేది కదా? అని సినీ పరిశ్రమలో అందరూ అనుకొంటున్నారు. మరి ‘అలా మొదలయిన’ ఆమె సినీ జీవితం ఇలా ఏ కోర్టుల చుట్టూ అల్లుకొని సాగుతుందో చూడాలి