గీత గోవిందంతో సూపర్ డూపర్ హిట్టు కొట్టాడు పరశురామ్. ఆ తరవాత… మహేష్ బాబుతో సినిమా చేసే అవకాశం వచ్చింది. అలా.. సర్కారు వారి పాట తీశాడు. ఆ సినిమా హిట్టుకీ, యావరేజ్‌కీ మధ్య ఊగిసలాడింది. అప్పటి నుంచీ పరశురామ్ ఖాళీగానే ఉన్నాడు. మధ్యలో నాగచైతన్యతో ఓ సినిమా చేయాలి. కానీ కుదర్లేదు. పరశురామ్ దగ్గర కథ ఉంది కానీ, హీరో లేడు. టాలీవుడ్ లో పెద్ద హీరోలంతా బిజీగా ఉన్న నేపథ్యంలో పరశురామ్ కి బాగా గ్యాప్ వచ్చేసింది. ఇప్పుడు పరశురామ్ దృష్టి.. బాలకృష్ణపై పడింది. గీతా ఆర్ట్స్ దగ్గర పరశురామ్ ఇది వరకే అడ్వాన్స్ తీసుకొన్నాడు. ఆ సంస్థలో ఓ సినిమా చేయాలి. ఇప్పుడు గీతా ఆర్ట్స్ లో బాలయ్య కూడా ఓ భాగమైపోయాడు. అందుకే ఎలాగోలా.. బాలయ్యని ఒప్పించి, గీతా ఆర్ట్స్ లో ఓ సినిమా చేయాలని పరశురామ్ భావిస్తున్నాడు.
అల్లు శిరీష్ నటించిన ఊర్వశివో – రాక్షసివో ప్రీ రిలీజ్ ఈవెంట్ కి బాలకృష్ణ ముఖ్య అతిథిగా విచ్చేశాడు. ఈ వేడుకకు పరశురామ్ కూడా వచ్చాడు. ఈ సందర్భంగా బాలయ్యని ఉద్దేశించి పరశురామ్ మాట్లాడుతూ ”సార్ .. త్వరలోనే ఓ కథతో మిమ్మల్ని కలుస్తా… ఈ విషయం అల్లు అరవింద్ గారికి కూడా తెలుసు…” అని హింట్ ఇచ్చేశాడు పరశురామ్. బాలయ్య ఓపెన్ మైండ్‌తో ఉంటాడు. ఎవరు కథ చెబుతానన్నా… వినడానికి రెడీనే. పైగా గీతా ఆర్ట్స్ కూడా బాలయ్యతో ఓ సినిమా చేయాలని చూస్తోంది. పరశురామ్ కథ ఓకే అయితే గనుక.. ఈ కాంబో సెట్టయిపోయినట్టే.