డ్రగ్స్ కేసులో పూరి జగన్నాథ్ ఈ రోజు ఎన్ఫోర్స్మెంట్ డైరక్టరేట్ ఎదుట హాజరు కానున్నారు. ఆయన తొలి వ్యక్తి . 22 రెండవ తేదీ వరకూ సెలబ్రిటీలు.. నాన్ సెలబ్రిటీల్ని విచారిస్తారు. ఆ మేరకు నోటీసులు జారీ చేశారు. ఇంకా విచారణ ప్రారంభం కాక ముందే ఈడీ నుంచి మీడియాకు కావాల్సినంత స్టఫ్ అందుతోంది. ఇక విచారణ ప్రారంభమైతే చెప్పాల్సిన పని లేదు. ఉన్నవి.. లేనివి.. రెండూ కలిపి మీడియాలో జరిగే ప్రచారానికి అంతే ఉండదు. ఈడీ కూడా ఇప్పటికే గ్రౌండ్ వర్క్ పూర్తి చేసింది. గతంలో డ్రగ్స్ కేసును పర్యవేక్షించిన అధికారుల దగ్గర నుంచి రిపోర్టులు తీసుకుంది.
అయితే ఇక్కడ డ్రగ్స్ వాడారా లేదా అన్నదానిపై విచారణ జరగడం లేదు. డ్రగ్స్ కొనుగోలు కోసం డబ్బులు పంపారు.. అన్న అంశంపైనే విచారణ జరగనుంది. అక్రమ పద్దతుల్లో నగదు తరలింపు జరిగిందని భావించబట్టే ఈడీ కేసు నమోదు చేసింది. ప్రివెన్షన్ ఆఫ్ మనీలాండరింగ్ సెక్షన్ 3,4 కింద కేసులు నమోదయ్యాయి. విచారణలో అక్రమ లావాదేవీలు గుర్తిస్తే ఆ మేరకు అదనపు కేసులు కూడా నమోదు చేసే అవకాశం ఉంది. తెలంగాణ ఎక్సైజ్ పోలీసులు గతంలో మొత్తం 62 మందిని ప్రశ్నించారు. ఇప్పుడు ఈడీ కూడా అందర్నీ ప్రశ్నించే అవకాశం ఉంది. సినీ ప్రముఖులకు మరో టెన్షన్ కూడా ఉంది. తెలంగాణ ఎక్సైజ్ శాఖ వీరికి క్లీన్ చిట్ ఇచ్చింది.
ఏ చార్జిషీట్లోనూ పేర్లు చూపించలేదు. దీంతో ఊపిరి పీల్చుకున్నారు. ఇప్పుడుఈడీకి దొరికిపోతే.. వారిపై ఎక్సైజ్ శాఖ కూడా కొత్తగా చర్యలు తీసుకోక తప్పదు. అప్పుడు రెండు రకాలుగా టాలీవుడ్ స్టార్లు ఇరుక్కోక తప్పదన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. ముందు ముందు డ్రగ్స్ కేసు కీలక మలుపులు తిరగడం ఖాయంగా కనిపిస్తోంది. అంతకు మించి నెల రోజుల పాటు మీడియాలో రోజంతా కవరేజీ కనిపించడం ఖాయమని అనుకోవచ్చు.