సామాన్యుడు ముఖ్యమంత్రి అయితే…. – ఈ లైన్లో వచ్చిన సినిమా – ఒకే ఒక్కడు. పొలిటికల్ డ్రామాల్లో ఆ సినిమా ఓ సంచలనం సృష్టించింది. లీడర్, భరత్ అనే నేను సినిమాలకూ ఈ కథే స్ఫూర్తి అనుకోవచ్చు. ఇప్పుడు పూరి కూడా.. ఇలాంటి లైన్ సిద్ధం చేశాడా? అవుననే అంటున్నాయి టాలీవుడ్ వర్గాలు. పూరి దగ్గర `జనగణమన` అనే ఓ కథ ఉంది. ఇది మహేష్‌బాబుతో తీస్తానని అప్పుడెప్పుడో చెప్పాడు పూరి. మహేష్ కూడా అప్పట్లో ఈ సినిమా చేయడానికి ఉత్సాహం చూపించాడు. ఎందుకో ఈ ప్రాజెక్టు పక్కకెళ్లిపోయింది. ఇప్పుడు ఈ కథని పట్టాలెక్కించడానికి పూరి సమాయాత్తం అవుతున్నాడని టాక్. ఈ కథ కూడా లీడర్, ఒకే ఒక్కడు లైన్లోనే సాగుతుందట.
ఇండియా ఎలా ఉండాలి, ఎలాంటి చట్టాలుంటే బాగుంటుంది? ఎలాంటి మార్పులు తీసుకురావాలి? అనే పాయింట్ చుట్టూ తిరిగే కథ ఇదని తెలుస్తోంది. ఒకే ఒక్కడు లా సామాన్యుడు సీఎం అనే లైన్ ఈ సినిమాలో నూ కనిపిస్తుందని తెలుస్తోంది. ఇటీవల భరత్ అనే నేను కూడా దాదాపు ఇలాంటి కథతోనే హిట్టయ్యింది. అందుకే పూరి ఈ స్క్రిప్టుని మళ్లీ బయటికి తీసి దుమ్ము దులిపే పనిలో ఉన్నాడని తెలుస్తోంది. అయితే సీఎమ్ అనే లైన్‌ని మార్చే అవకాశాలున్నాయని, లీడర్, భరత్ అనే నేను ముద్ర పడకుండా పూరి కొత్త మార్పులు చేయబోతున్నాడని తెలుస్తోంది. ప్రస్తుతం ఉన్న పరిస్థితిలో పూరి – మహేష్‌ల కాంబో సెట్టవ్వకపోవచ్చు. మరి పూరి మైండ్‌లో ఉన్న జనగణమన కథని ఏ హీరోతో సెట్ చేయిస్తాడో??