క్రిష్ దర్శకత్వంలో వరుణ్ తేజ్, ప్రగ్యా జైస్వాల్ జంటగా నటిస్తున్న ‘కంచె’ సినిమా ట్రైలర్ విడుదల కార్యక్రమానికి దర్శకుడు రాజమౌళి హాజరయ్యారు. ఆ సందర్భంగా ఆయన మెగా కుటుంబం నుండి వస్తున్న హీరోల గురించి అన్న మాటలు చాలా ఆలోచింపజేసేవిగా ఉన్నాయి. “మెగా కుటుంబ నేపధ్యం ఒకవిధంగా అదృష్టం మరో విధంగా ఒక శాపం కూడా. ఈరోజుల్లో ప్రేక్షకులను మెప్పించి సినిమా హిట్ చేసుకోవడం చాలా కష్టంగా మారింది. మెగా కుటుంబం నుండి వస్తున్న హీరోలపై చాలా భారీ అంచనాలు ఉంటాయి. కనుక వారిపై కనిపించని ఒత్తిడి కూడా విపరీతంగా ఉంటుంది. ప్రేక్షకుల అంచనాలను అందుకోవాలంటే అందుకు వారు మిగిలిన హీరోల కంటే చాలా ఎక్కువ శ్రమించాల్సి వస్తుంది. వరుణ్ తేజ్ పై కూడా ప్రేక్షకులలో అటువంటి భారీ అంచనాలే ఉంటాయి. కనుక సినీ పరిశ్రమలో ఉన్న పోటీని తట్టుకొని నిలబడేందుకు ఒక పక్క గట్టిగా ప్రయత్నాలు చేస్తూనే మరోపక్క ప్రేక్షకుల అంచనాలను అందుకోవడానికి అతను చాలా కష్టపడాల్సి ఉంటుంది. తన స్వంత స్టయిల్, బాడీ లాంగ్వేజ్ ను ఏర్పరచుకోవాలి,” అని అన్నారు.