‘ఫిదా’ తో మళ్ళీ లైమ్ లైట్ లోకి వచ్చారు శేఖర్ కమ్ముల. అయితే ఫిదా తర్వాత మళ్ళీ శేఖర్ నుంచి సినిమా వచ్చి మూడేళ్ళు గడిచిపోయింది. కరోనా కారణంగా లవ్ స్టొరీ వాయిదా పడుతూ వచ్చింది. అయితే ఎట్టకేలకు సినిమా ప్రేక్షకుల ముందుకు ఈనెల 24న వస్తుంది. నాగచైతన్య-సాయి పల్లవి కెమిస్ట్రీ ట్రైలర్స్ లో అదిరిపోయింది. మెగాస్టార్ చిరంజీవి,బాలీవుడ్ స్టార్ అమీర్ ఖాన్ లాంటి హేమాహేమీలు సినిమా ప్రమోషన్స్ లో కనిపించి అంచనాలు పెంచారు. తాజాగా శేఖర్ కమ్ముల లవ్ స్టొరీకి సంబధించి మరిన్ని ముచ్చట్లు పంచుకున్నారు. ఆ కబుర్లు ఇవే…
శేఖర్ కమ్ముల సినిమా అంటేనే ఫీల్ గుడ్. మరి ‘లవ్ స్టొరీ’ ?
లవ్ స్టొరీ కూడా ఫీల్ గుడ్ మూవీ. ఒక అమ్మాయి, అబ్బాయికి మధ్య ఉండే రొమాన్స్, మ్యూజిక్ చక్కగా కుదరడంతో బలమైన రెండు అంశాలని చూపించే ప్రయత్నం చేశాం. ఆ పాయింట్స్ ఈ సినిమాని మరో స్థాయిలో నిలబెడతాయని నమ్ముతున్నాం.
ఏమిటా పాయింట్స్ ?
కుల వివక్ష, లింగ వివక్ష. ఇవేమీ కొత్త పాయింట్స్ కావు. సమాజంలో ఎప్పుడూ వుండేవే. అయితే వాటిని మరింత బలంగా చూపించే ప్రయత్నం చేశాం. ఈ వివక్షలు, ఆ కష్టాలు ఎదురుకున్న వారికి లవ్ స్టొరీ మరింత నచ్చుతుంది. మళ్ళీ మళ్ళీ చూస్తారు.
సమస్యలకి సినిమాలో పరిష్కారం చూపించారా?
ఈ సమస్యలు ఇప్పటికావు. ఎన్నో శతాబ్దాలు నుంచి దొరకని పరిష్కారం ఇప్పుడు దొరుకుతుంది అనుకుంటున్నారా? ఒక తప్పు జరిగినప్పుడు తప్పు అని ఎన్ని సార్లు చెప్తాం? ఇప్పుడు నిర్భయ అంశం ఉంది దాని తర్వాత ఎన్ని ఘటనలు జరిగాయి? ఇవన్నీ మనుషులు జీవితంలో అలవాటు అయ్యిపోతున్నాయి. అదే నా బాధ. భయం. ఏదో పెద్ద సునామి వచ్చేసి మళ్ళీ మనషులు కొత్తగా పుట్టాలేమో. అదొక్కటే పరిష్కారం అనిపిస్తుంది (నవ్వుతూ)
లీడర్ తర్వాత మరో సోషల్ ఇష్యూ సినిమా ‘లవ్ స్టొరీ’ అనుకోవచ్చా ?
లీడర్ పొలిటికల్ డ్రామా. నిజమైన నాయకుడు, అవినీతి ఇలాంటి అంశాలపై వుంటుంది. లీడర్ లో కూడా కోటాగారి పాత్రలో ‘కులం’ పాయింట్ ని టచ్ చేశా. కానీ దానిపై పూర్తిగా స్థాయిలో ఓ సినిమా చేయాలని ఎప్పటినుంచో వుండేది. లవ్ స్టొరీలో అది కుదిరింది.
లాక్ డౌన్ ఎఫెక్ట్ లవ్ స్టొరీ పై ఎంత ?
చాలా. లాక్ డౌన్ పెట్టె ముందు కేవలం నెల రోజుల షూటింగ్ మాత్రమే మిగిలింది. ఆన్ లాక్ కోసం ఎదురుచూశాం. మళ్ళీ అన్ని జాగ్రత్తలు తీసుకొని ఇండస్ట్రీలో ఫస్ట్ షూట్ కూడా మేమే స్టార్ట్ చేసాం. కరోనా ప్రోటోకాల్ ప్రకారం షూట్ చేయడానికి దాదాపు ట్రిపుల్ బడ్జెట్ అయ్యింది. ఈ గ్యాప్ రెండో వేవ్ వచ్చేసింది. సీన్ అంతా ఒటీటీకి మారిపోయింది. వేరే నిర్మాతలైతే ఖచ్చితంగా సినిమా ఓటిటికి ఇచ్చేసేవాళ్ళు. కానీ నారాయణ్ దాస్ గారు థియేటర్ లోనే రిలీజ్ చేయాలనీ బలంగా నిలబడ్డారు. ఆయన కారణంగానే లవ్ స్టొరీ థియేటర్ కి సాధ్యమైయింది.
నాగ చైతన్య తెలంగాణ కుర్రాడిలా ఎలా ఉంటారు ?
చాలా బావుంటాడు. కొత్త నాగచైతన్యని చూస్తారు. తన డైలాగ్స్, మ్యానరిజమ్స్ అన్నీ కొత్తగా వుంటాయి. ఇందులో జుంబా డ్యాన్సర్ గా కనిపిస్తాడు. డ్యాన్స్ లో కూడా కొత్త నాగచైతన్య కనిపిస్తాడు. చైతు పాత్ర చాలా కనెక్టింగా వుంటుంది.
సాయి పల్లవి పాత్ర ఎలా వుంటుంది ?
సాయి పల్లవి గురించి కొత్తగా చెపాల్సిన పనిలేదు. మంచి పెర్ఫామార్. ఫిదాలో చూశారు. అయితే లైవ్ స్టొరీ అందుకు రివివర్స్ లో వుంటుంది. ఫిదాలో సాయిపల్లవి పాత్ర చేయడానికి కొంచెం తేలికగా వుంటుంది. కోపం, బాధ బయటికి చూపించడం ఈజీ. ఫిదాలో బానుమతి ఎమోషన్స్ ని బయటికి చూపించే పాత్ర. కానీ లవ్ స్టొరీకి వచ్చేసరికి పూర్తి విరుద్ధంగా వుంటుంది. ఎమోషన్స్ ని తనలోనే కంట్రోల్ చేసుకునే పాత్ర. ఖచ్చితంగా మీ అందరికీ నచ్చుతుంది.
కొత్త సంగీత దర్శకుడితో పని చేయడం ఎలా అనిపించింది ?
పవన్, రెహమాన్ స్కూల్ నుంచి వచ్చాడు. పైగా మనోడే. మంచి మ్యూజిక్ ఇచ్చాడు. కరోనా కష్టకాలంలో లవ్ స్టొరీ మ్యూజిక్ మాకు పెద్ద రిలాక్స్ ఇచ్చింది. పవన్ భవిష్యత్ లో మంచి మ్యూజిక్ వస్తుంది.
మీ ‘లవ్ స్టోరీ’ చరిత్రలో నిలిచేదిలా ఉంటుందా?
ప్రతి దర్శకుడు చరిత్రలో నిలిచేలా సినిమా తీయాలనే చూస్తాడు. లవ్ స్టొరీ కూడా ఆ స్థాయి వుందని నమ్ముతున్నా. నాగార్జున గారు ”ప్రేమ్ నగర్’ సినిమా రిలీజ్ రోజున ఇది కూడా అవుతుందని ఆ మధ్య ఓ పోస్ట్ పెట్టారు. ఆ సినిమా సక్సెస్ లో నా సినిమా ఒక 30 పర్సెంట్ అందుకున్నా కూడా హ్యాపీ.
‘లీడర్’ సినిమాకి సీక్వెల్ ఏమన్నా ప్లాన్ చేస్తున్నారా?
ఖచ్చితంగా వుంటుంది. అదీ రానాతోనే.
కొత్త సినిమా కబుర్లు ?
ధనుష్ తో ఓ సినిమా చేస్తున్నా. తమిళ్, తెలుగు, హిందీ మూడు భాషల్లో అనుకుంటున్నాం. థ్రిల్లర్ జానర్ లో వుంటుంది.
అల్ ది బెస్ట్..
థ్యాంక్ యూ..