కమల్ హాసన్ – శంకర్ కాంబినేషన్ లో వచ్చిన ‘భారతీయుడు’ ఎంత పెద్ద సంచలనం సృష్టించిందో… సీక్వెల్ గా వచ్చిన ‘భారతీయుడు 2’ అంతగా విమర్శల పాలయ్యింది. కమల్ గెటప్పుల దగ్గర్నుంచి శంకర్ రాసుకొన్న కథ, కథనాల వరకూ మొత్తం…. నెగిటీవ్ మైలేజీ తీసుకొచ్చింది. శంకర్ కెరీర్లోనే భారీ డిజాస్టర్ గా ‘భారతీయుడు 2’ మిగిలిపోయింది. దాంతో ‘భారతీయుడు 3’ పరిస్థితి ఏమిటి? అనే చర్చ మొదలైంది. భారతీయుడు 2తో పాటు 3నీ… సమాంతరంగా ముగించాడు శంకర్. 2025 జనవరిలో పార్ట్ 3 ని విడుదల చేస్తున్నామని ప్రకటించాడు. ‘భారతీయుడు 2’ లో క్లిప్ హ్యాంగర్ గా కొన్ని షాట్స్ కూడా చూపించాడు. ఆ షార్ట్స్ నిజంగా ఆసక్తిని రేకెత్తించాయి. నిజానికి ‘భారతీయుడు 2’లో చెప్పాల్సిన కథంతా.. పార్ట్ 3లో దాచేసుకొన్నాడేమో అనిపించింది. పార్ట్ 2 బాగోకపోయినా… పార్ట్ 3లో మేటర్ ఉందన్న ఫీలింగ్ కలిగింది. అయితే.. ఇప్పుడు పార్ట్ 3 విషయంలో శంకర్ ఓ అనూహ్యమైన నిర్ణయం తీసుకొన్నాడని తెలుస్తోంది. అదేంటంటే ఈ సినిమాని నేరుగా ఓటీటీలో విడుదల చేయాలని చిత్రబృందం భావిస్తోంది. వచ్చే జనవరిలో నెట్ ఫ్లిక్స్ ద్వారా నేరుగా ఈ సినిమాని ఓటీటీలో వదిలేస్తున్నార్ట.
అదీ ఒకందుకు మంచిదే అనుకోవాలి. ఎందుకంటే… ‘భారతీయుడు 2’ ఫ్లాప్‌లో.. 3 పై ఆసక్తి పూర్తిగా పోయింది. కమల్ హాసన్‌ని నమ్ముకొని… టికెట్ కొని మరీ థియేటర్లకు వెళ్తారనుకోవడం కష్టమే. ఓటీటీలో విడుదల చేసినా.. కాస్త ఆసక్తి ఉంటుంది. ఓటీటీలో సినిమాలు కాస్త అటూ ఇటుగా ఉన్నా, ఇంట్లో కూర్చుని చూసే సినిమానే కాబట్టి కొన్ని మినహాయింపులు ఇస్తుంటారు. యావరేజ్ గా ఉన్నా.. ఆయా సినిమాల్ని గట్టెక్కించేస్తారు. పైగా బాక్సాఫీసు రిజల్ట్ ఎలా ఉంటుందో అనే ఒత్తిడి ఉండదు. అన్నింటికంటే మించి డైరెక్ట్ ఓటీటీ కాబట్టి మంచి డీల్ దొరుకుతుంది. అందుకే శంకర్ అండ్ కో ఈ నిర్ణయం తీసుకొందని తెలుస్తోంది. ఒకవేళ డిసెంబరులో విడుదలయ్యే ‘గేమ్ ఛేంజర్’ అనూహ్యమైన విజయాన్ని అందుకొంటే.. ఆ ఎఫెక్ట్ ‘భారతీయుడు 3’పై ఉంటుంది. అప్పుడేమైనా థియేటర్లలో విడుదల చేసే ఆలోచన చేయొచ్చు. ప్రస్తుతానికైతే ‘భారతీయుడు 3’ ఓటీటీకే పరిమితమయ్యే అవకాశాలు పుష్కలంగా ఉన్నాయి.