శాకినీ డానికీ ఈనెల 16న వస్తోంది. ప్రమోషన్లు కూడా గట్టిగానే చేస్తున్నారు. అయితే ఏ ప్రమోషన్‌లోనే దర్శకుడు సుధీర్ వర్మ కనిపించడం లేదు. ఈ చిత్ర నిర్మాత సునీతకూ, సుధీర్ కూ మధ్య గ్యాప్ వచ్చిందని, అందుకే ఈ సినిమాని సుధీర్ వర్మ పట్టించుకోవడం మానేశాడని తెలుగు 360 ముందే చెప్పింది. దానికి సునీత కూడా క్లారిటీ ఇచ్చింది. “ఆయన తన సినిమా పనుల్లో బిజీగా ఉన్నారు. అందుకే మేం కూడా డిస్ట్రబ్ చేయడం లేదు. మున్ముందు ఇంకా ప్రమోషన్ ఈవెంట్స్ ఉంటాయి కదా.. వాటికి వస్తారు“ అన్నట్టు మాట్లాడారు.
అయితే.. సోమవారం ప్రీ రిలీజ్ ఈవెంట్ జరిగింది. దానికి.. డైరెక్టర్ డుమ్మా కొట్టాడు. దాంతో.. ఈ గ్యాప్ ఇంకా తగ్గలేదన్న విషయంలో క్లారిటీ వచ్చేసింది. సుధీర్ వర్మ ఈ సినిమాని వదిలేయడానికి చాలా కారణాలున్నాయి. ఒకటి.. స్క్రిప్టు విషయంలో సుధీర్‌కి ఫ్రీ హ్యాండ్ ఇవ్వలేదు. మరోటి.. ఈ సినిమాలోని కొన్ని సీన్లని మరో దర్శకుడు (మోహన్ రంగ) తో రీషూట్లు చేయించారు. అది కూడా సుధీర్ వర్మకు తెలియకుండానే. దాంతో నిర్మాతతో విబేధాలు మొదలయ్యాయి. అవి ఇప్పటి వరకూ తగ్గలేదు. మధ్యలో.. ప్యాచప్ చేయడానికి కొంతమంది ప్రయత్నించినా – అవి సఫలం కాలేదు. ఇక ముందు కూడా సుధీర్ వర్మ ఈ టీమ్ లో కనిపించకపోవొచ్చు.
సుధీర్ వర్మని పక్కన పెడితే సురేష్ బాబు కూడా ఈ ఈవెంట్ లో కనిపించలేదు. ఈ సినిమాకి ఆయన ఒకానొక నిర్మాత కూడా. తాటి సునీత తెరకెక్కించిన `ఓ బేబీ` సినిమాలోనూ సురేష్ బాబు హ్యాండ్ ఉంది. ఆ సినిమా ప్రమోషన్లను సురేష్ బాబు దగ్గరుండి చూసుకొన్నారు. ఆయన కూడా ఇప్పుడు శాకిని డానికిని వదిలేశారు. సురేష్ బాబు సైడ్ అవ్వడానికి కారణం కూడా సునీత వ్యవహార శైలే అని తెలుస్తోంది. స్క్రిప్టు, నిర్మాణం విషయాల్లో అతి జోక్యంతో సురేష్ బాబు కూడా భరించలేకపోయారన్నది ఇండస్ట్రీ వర్గాల టాక్.