చిన్న సినిమాల సక్సెస్ సీక్రెట్ ఒక్కటే. ఓ మంచి టైటిల్ తో జనాల్ని ఆకర్షించడం.. ఆ తరవాత కంటెంట్‌తో వాళ్లని థియేటర్లో కూర్చోబెట్టడం. ఈ రెండు విషయాల్లో సక్సెస్ అయితే చిన్న సినిమానీ పెద్ద సినిమాగా మార్చుకోవొచ్చు. ఇప్పుడొక టైటిల్ ఇలానే టాలీవుడ్లో ఆసక్తిని రేపుతోంది. అదే… దేవిశ్రీ ప్రసాద్. సంగీత దర్శకుడిగా దేవిశ్రీ ప్రసాద్ పాపులర్! ఆ పేరు తెలియని వాళ్లుండరు.కానీ.. ఈ పేరుని టైటిల్‌గా మార్చుకొని ఓ సినిమా తీస్తున్నారు. ఆ సినిమాకీ దేవిశ్రీ ప్రసాద్‌కీ ఏ విధమైన సంబంధం లేదు. పైగా మ్యూజిక్ బ్యాక్ డ్రాప్ ఉన్న సినిమా కూడా కాదు. ఇదో హారర్ మూవీ.
శ్రీ కిషోర్ దర్శకత్వం వహించిన చిత్రమిది. ఇది వరకు సశేషం, భూ సినిమాల్ని తెరకెక్కించాడు. రెండూ థ్రిల్లర్ చిత్రాలే. ముచ్చటగా మూడోసారీ అలాంటి ప్రయత్నమేచేశాడు. టైటిల్‌తో కూడిన పోస్టర్ ఈమధ్యే బయటకు వచ్చింది. దేవిశ్రీ ప్రసాద్ అనగానే.. ఆ టైటిల్ అందరికీ నచ్చేసింది. దేవి, శ్రీ, ప్రసాద్ అనే ముగ్గురి కథ ఇది. అందుకే దర్శకుడు తెలివిగా ఆ పేరు పెట్టాడు. టైటిల్ వరకూ బాగానే ఆలోచించాడు. మరి కంటెంట్ ఎలా ఉంటుందో? అక్కడా ఓకే అనిపిస్తే, చిన్న సినిమా.. పెద్ద సినిమాగా మారడం ఖాయం.