క్రియేటీవ్ డైరెక్టర్ సుకుమార్ దృష్టి ఇప్పుడో చిన్న సినిమాపై పడింది. కేవలం టీజర్ ని చూసి ఇంప్రెస్ అయిపోయిన సుకుమార్… ఆ సినిమాని ప్రమోషన్ బాధ్యతని సైతం తీసుకొన్నాడు. ఆ సినిమానే ‘సిద్దార్థ్ రాయ్’. `అతడు`లాంటి సూపర్ హిట్ చిత్రాల్లో నటించిన బాల నటుడు దీపక్ సరోజ్ హీరోగా ఎంట్రీ ఇస్తున్న సినిమా ఇది. యశస్వీ దర్శకత్వం వహించారు. త్వరలోనే విడుదల కానుంది.
నిజానికి ఈ సినిమాకీ సుకుమార్‌కీ ఎలాంటి సంబంధం లేదు. కేవలం టీజర్ చూసి.. అది నచ్చడంతో దర్శకుడ్నీ, హీరోనీ తన సెట్ కి పిలిపించి అభినందించారు సుకుమార్. టీజర్‌లోని ప్రతీ షాట్ గురించీ, ప్రతీ డైలాగ్ గురించీ సుకుమార్ మాట్లాతోంటే, తనదైన రివ్యూ ఇస్తోంటే చిత్ర బృందం షాక్ అయిపోయిందట. సుకుమార్‌కి ఈ టీజర్ అంతగా నచ్చింది. సుకుమార్ లాంటి దర్శకుడు ఓ చిన్న సినిమాని మెచ్చుకోవడం, చిత్రబృందాన్ని మెచ్చుకోవడం నిజంగా హర్షించదగిన విషయమే. ‘సిద్దార్థ్ రాయ్’కి ఇది నిజమైన బూస్టప్. టీజర్లో… ‘అర్జున్ రెడ్డి’ వైబ్స్ పుష్కలంగా కనిపిస్తున్నాయి. మరి ఈ సినిమాలో కొత్త ఏం చెప్పారో, సుకుమార్ ప్రమోషన్స్ ఈ సినిమాకి ఎంత వరకూ ఉపయోగపడతాయో తెలియాలంటే ఇంకొన్ని రోజులు ఆగాలి.