చిరంజీవి – త్రివిక్రమ్… ఈ కాంబినేషన్‌ని ఎవరూ ఊహించలేదు. కొరటాల శివ తరవాత.. బోయపాటి శ్రీను లైన్లో ఉండడంతో.. చిరు సినిమా కోసం మరో దర్శకుడి పేరు ఏదీ ప్రస్తావనకు రాలేదు. సడన్‌గా.. త్రివిక్రమ్ కాంబినేషన్‌ని బయటపెట్టేశాడు చిరంజీవి. `వినయ విధేయ రామ` ఫంక్షన్ లో త్రివిక్రమ్‌ని చూడగానే మెగా అభిమానుల్లో ఓ తీయని సందేహం రేగింది. రామ్‌చరణ్ – త్రివిక్రమ్ భవిష్యత్తులో కలసి పనిచేస్తారేమో అనుకున్నారు. ఆ కాసేపటికే చిరు బాంబ్‌బ్లాస్ట్ చేశాడు. చరణ్ – త్రివిక్రమ్ కాంబో కంటే.. చిరు – త్రివిక్రమ్ కాంబోనే.. అంచనాల్ని పెంచుతుందనడంలో సందేహం లేదు. ఎందుకంటే చిరు కామెడీ టైమింగ్ అద్భుతంగా ఉంటుంది. అగ్ర కథానాయకుల్లో చిరులా.. కామెడీ చేసేవాళ్లు లేరనడంలో సందేహం లేదు.
త్రివిక్రమ్‌కి ఇది మంచి ఛాన్స్. ఎందుకంటే ఇది వరకు చిరంజీవి `జై చిరంజీవ` చిత్రానికి త్రివిక్రమ్ సంభాషణలు అందించాడు. ఆ సినిమా ఫ్లాప్ అయ్యింది. ఆ పరాజయంలో త్రివిక్రమ్‌కీ వాటా ఉన్నట్టే. ఆమధ్య చిరంజీవి – పవన్‌లతో త్రివిక్రమ్ ఓ సినిమా చేస్తాడని వార్తలొచ్చాయి. సుబ్బిరామిరెడ్గి ఈ సినిమా చేయాలని చాలా ఉత్సాహం చూపించారు. కానీ…అది కుదర్లేదు. ఇక చిరు – త్రివిక్రమ్ కాంబో చూడలేమేమో అనుకున్న తరుణంలో ఈ కాంబో బ్లాస్ట్‌లా పేలింది. దాన్ని సద్వినియోగపరచుకోవడం త్రివిక్రమ్ చేతుల్లోనే ఉందిప్పుడు.