వంశీ కి అద్భుతమైన సంగీత జ్ఞానం ఉంది. అందుకే తన సినిమాలోని పాటలన్నీ హిట్టే. వంశీ – ఇళయరాజా అంటే అది అల్టిమేట్ కాంబినేషన్. ఆ ఆల్బమ్ అనగానే బాలు గుర్తొస్తారు. వంశీకి బాలు పాడిన అన్ని పాటలూ సూపర్ హిట్టే. కానీ ఓ పాటని బాలు పాడకుండా వెళ్లిపోయారు. ఆ కథని వంశీ తన ‘పొలమారిన జ్ఞాపకాలు’ పుస్తకంలో రాసుకొచ్చారు.
‘పొలమారిన జ్ఞాపకాలు’ అంటే… వంశీ అనుభవాలు. ఇవన్నీ ఓ సీరియల్ రూపంలో స్వాతి వారపత్రిలో ప్రచురించారు. వాటికి మంచి ఆదరణ దక్కింది. వీటికి డాక్యుమెంటరీ రూపం కల్పించాలని కూడా అనుకొన్నారు. వెబ్ సిరీస్‌గా తీద్దామని శేఖర్ అనే ఓ నిర్మాత కూడా ముందుకు వచ్చారు. ఈ సిరీస్ కోసం ఓ అందమైన పాట రాసుకొన్నారు వంశీ. రఫ్‌గా ట్యూన్ చేసి, పాడుకొని పెట్టుకొన్నారు కూడా. అయితే దాన్ని బాలుతో పాడిస్తే బాగుంటుందనుకొన్నారు.
అయితే అంతలోనే కరోనా వచ్చింది. రికార్డింగులు బంద్ అయ్యాయి. కొన్నాళ్లకు కాస్త తెరిపి ఇచ్చింది. సారధి స్టూడియోలో పాడుతా తీయగా కార్యక్రమానికి బాలు వచ్చినప్పుడు శేఖర్.. ఆయన్ని కలుసుకొన్నారు. వంశీగారు పాట రాశారు, మీరు పాడాల్సిందే అని పట్టుపట్టారు. `వంశీ రాస్తే ఎందుకు పాడను? తప్పకుండా పాడతా` అని మాట ఇచ్చారు బాలు. అయితే ఆ తరవాత… బాలుకి కరోనా సోకింది. ఆయన ఆసుపత్రిలో చేరారు. దాంతో.. వంశీ గాభరా పడిపోయారు. ఆయనకు నయం కావాలని దేవుడ్ని ప్రార్థించారు. బాలు కోలుకొన్నారని, కరోనా నెగిటీవ్ వచ్చిందని వార్త తెలియగానే పార్టీ కూడా చేసుకొన్నారు. కానీ.. తెల్లారే సరికి బాలు లేరన్న వార్త బయటకు వచ్చింది. దాంతో వంశీ కొయ్యబారిపోయారు. బాలు లేరన్న వార్త అబద్ధం అయితే బాగుణ్ణు అనుకొన్నారు. కానీ విధిరాతను మార్చేదెవరు? బాలు కోలుకొంటే.. ఆయన పాడే మొదటి పాట ఇదే అయ్యేది.
ఇంతకీ ఆ పాటలో పల్లవి ఏంటంటే..
”ఎన్ని రంగుల జ్ఞాపకాలు
ఎన్నో హంగుల జ్ఞాపకాలు
తడిసిన ఆ జ్ఞాపకాలు
మెరిసిన ఆ జ్ఞాపకాలు
మాట్లాడిన జ్ఞాపకాలు
పోట్లాడిన జ్ఞాపకాలు
శృతిమారిన జ్ఞాపకాలు
పొలమారిన జ్ఞాపకాలు…”
ఈ పాట పాడితే.. అదో మధుర జ్ఞాపకంగా మిగిలేది. ఇప్పుడు బాలునే ఓ జ్ఞాపకంగా మారిపోయారు.