వెటరన్ దర్శకుడు వంశీ మరోసారి మెగా ఫోన్ పడుతున్నారు. తనదైన స్టైల్లో ఓ సంగీతభరమైన చిత్రాన్ని తీయాలనుకుంటున్నారు. అందుకు రంగం కూడా సిద్ధం అవుతోంది. వంశీ సినిమా అనగానే పాటలు గుర్తొస్తాయి. ఆయన సినిమాల్లో పాటలు కొత్త సౌండింగ్ తో ఉంటాయి. సినిమా ఎలా ఉన్నా, పాటల కోసమైనా చూడాలనిపిస్తుంది. తప్పకుండా ఒకట్రెండు హిట్ గీతాలుండడం రివాజు. మొదట్లో వంశీ సినిమా అనగానే ఇళయరాజా పాటలు తప్పనిసరి. ఆ తరవాత… చక్రి వచ్చాడు. వంశీ – చక్రి మధ్య మంచి ట్యూనింగ్ కుదిరింది. అయితే చక్రి మరణంతో… వంశీ సినిమాల్లో పాటల పస తగ్గింది. దాంతో మరో మంచి సంగీత దర్శకుడి కోసం వంశీ అన్వేషిస్తున్నారు. ఎట్టకేలకు… వంశీ అన్వేషణ ఫలించింది. ఆయన.. తన తదుపరి చిత్రానికి అనూప్ రూబెన్స్ని సంగీత దర్శకుడిగా ఎంచుకున్నారు. మనం సినిమాలోని పాటలంటే వంశీకి ఇష్టమట. ఈమధ్య విడుదలైన `30 రోజుల్లో ప్రేమకథ`లోని `నీలి నీలి ఆకాశం` పాట కూడా వంశీకి బాగా నచ్చిందట. అందుకే అనూప్ ని తన సినిమాకి ఎంచుకున్నారు. వంశీది ఓ డిఫరెంట్ స్కూల్. ఆయనకు అనుగుణంగా ట్యూన్ అయిపోతే.. తప్పకుండా మంచి పాటలొస్తాయి. అనూప్ టాలెంటెడే. అందులో డౌటే అక్కర్లెద్దు. వంశీతో కలిస్తే.. ఆ విజృంభణ ఎలా ఉంటుందో చూడాలి.