వంశీ గొప్ప భావకుడు. తెలుగు చిత్రసీమకు లభించిన అరుదైన దర్శకుడు. వంశీ ఓ మంచి రచయిత కూడా. తన కథల్లో సైతం గోదావరి ప్రవహిస్తుంటుంది. వంశీలో ఓ సంగీత దర్శకుడు కూడా ఉన్నాడు. తను కొన్ని సినిమాలకు పాటలు కూడా రాశారు. కానీ తొలి సారి పాట కోసం కలం పట్టింది మాత్రం `అనుమానాస్పందం` సినిమాకే. అందులోని `ప్రతిదినం నీ దర్శనం ఇక దొరకునా దొరకునా` అనే పాట రాశారు. ఇళయరాజా కంపోజిషన్ లో వచ్చిన ఆ పాట సూపర్ డూపర్ హిట్. ఈ పాట రాయడం వెనుక ఇళయరాజా ప్రోత్సాహం, బలవంతం మొండుగా ఉన్నాయి.
‘అనుమానాస్పందం’ చిత్రానికి సంబంధించి మ్యూజిక్ సిట్టింగ్స్ జరుగుతున్నాయి. అప్పటికి వేటూరి సుందర్రామ్మూర్తిగారు పాటలన్నీ రాసేశారు. ఓ పాట బాకీ ఉంది. ఇంతలో ప్రొడ్యూసర్లు వచ్చి.. ‘ఇప్పటికే పాటలకు బడ్జెట్ ఎక్కువైపోయింది. ఈ ఒక్క పాటకూ కనీసం రూ.50 వేలు తగ్గితే కాస్త బాగుంటుంది’ అన్నారు. ఇదే విషయాన్ని ఇళయరాజాకి చెప్పారు వంశీ. కానీ అప్పటికే చివరి పాటకు సంబంధించిన నోట్స్ ఇళయరాజా తయారు చేసేశారు. ట్యూన్ కూడా బాగా వచ్చింది. దాంతో ఈ ట్యూన్‌ని వదులుకోవడం వంశీకి ఇష్టం లేకపోయింది. అలాగని వేటూరికి ఇస్తే… మరో రూ.50 వేలు ఖర్చవుతాయి. దాంతో ఇళయరాజా ఓ సలహా ఇచ్చారు. ‘ఈ పాట నువ్వే రాయ్’ అంటూ. వంశీ దగ్గర ఇళయరాజా మాటకు తిరుగుండదు. ఖర్చు తగ్గించుకోవాలంటే ఆ పాట తానే రాయాలి. అందుకే కేవలం 45 నిమిషాల్లో ఆ పాటని రాసేశారు వంశీ. ‘గాలి కొండాపురం రైల్వే గేట్’ సినిమా కోసం ఇళయరాజా పల్లవులు రాస్తే.. వంశీ చరణాలు రాసి ఓ పాట సిద్ధం చేశారు. ఆ పాటని లతా మంగేష్కర్ పాడారు. కానీ అనివార్య కారణాల వల్ల ఆ సినిమా ఆగిపోయింది. దాంతో పాటలూ బయటకు రాలేదు.