ఒకట్రెండు హిట్లొస్తే చాలు కాలర్ ఎగరేస్తుంటారు కుర్రహీరోలు. ‘పరిశ్రమ అంతా నాతోనే’ అనే భ్రమల్లో బతికేస్తుంటారు. పారితోషికాలు పెంచేయడాలూ, సెట్లో అజమాయిషీ చేసేయడాలూ… మామూలే! ఫలానా హీరోయన్ని తీసుకొంటారా, లేదా?? అంటూ డిమాండింగులూ గట్రా చేసేస్తుంటారు. రాజ్ తరుణ్ కూడా ఆ బాబతే. వరుసగా మూడు హిట్లు కొట్టాడు కదా..?? అందుకే తన బలుపు చూపించడం మొదలెట్టాడు. సెట్లో రాజ్ తరుణ్ వ్యవహారం ఏమంత బాగోదని, తరుణ్‌తో చేస్తున్న నిర్మాతలు వాపోతుంటారు. ఈ బలుపే.. ఓ సీనియర్ దర్శకుడి దగ్గర చూపించాలనుకొని అడ్డంగా బుక్కయ్యాడు రాజ్ తరుణ్.. ఆ వివరాల్లోకి వెళ్తే…
గోదారి అందాల్ని, పల్లెటూరి కథల్ని వెండి తెరపై అద్భుతంగా ఆవిష్కరించే దర్శకుడు వంశీ. లేడీస్ టైలర్‌కి సీక్వెల్‌గా ఫ్యాషన్ డిజైనర్ సినిమా చేయాలని ఎప్పటి నుంచో అనుకొంటున్నారు. ఈ కథ రవితేజ కోసమే రాసుకొన్నా… ఆయనగారు కరుణించలేదు. అందుకే జూ.రవితేజలాంటి బాడీ లాంగ్వేజ్ ఉన్న రాజ్ తరుణ్‌కి ఈ కథ వినిపించారు. వంశీతో సినిమా చేయడమే అదృష్టం అని ముందు పొంగిపోయినా.. ఆ తరవాత తన ఖాతాలో పడుతున్న హిట్లు గుర్తొచ్చిన రాజ్ తరుణ్…తన ఎటకారం చూపించడం మొదలెట్టాడు. ‘అది బాలేదు.. ఇది బాలేదు’ అంటూ స్ర్కిప్టులో కాళ్లూ, వేళ్లే పెట్టి కెలికేయడం స్టార్ట్ చేశాడట. దాంతో వంశీకి తిక్క రేగింది. ‘నువ్వొద్దులే అబ్బాయ్.. ఇంకొకర్ని చూసుకొంటా’ అంటూ మొహం మీదే చెప్పేసి.. మరో కుర్ర హీరోతో వంశీ కమిట్ అయిపోయాడని టాక్. వంశీ ఇలాంటి నిర్ణయం తీసుకొంటాడని తెలీని రాజ్ తరుణ్.. ఇప్పుడు అయ్యో.. అంటున్నాడట. సీనియర్ల ముందే తొక జాడిస్తే ఫలితం ఇలానే ఉంటుంది మరి.