హీరోలు పారితోషికం తగ్గించుకోవాలని, నిర్మాతలకు వెసులుబాటు ఇవ్వాలన్న డిమాండ్లు ఇప్పటివి కావు. ఓ పెద్ద సినిమా ఫ్లాప్ అయినప్పుడో, నిర్మాత రోడ్డు మీద పడినప్పుడో, వరుసగా సినిమాలు డిజాస్టర్లు అవుతున్నప్పుడో తప్పకుండా ఇలాంటి కామెంట్లు వినిపిస్తుంటాయి. కానీ ఏ హీరో కూడా తన పారితోషికాన్ని తగ్గించుకొన్న దాఖలా కనిపించదు. సినిమా పోతే, అప్పుడు ఎంతో కొంత తిరిగిస్తుంటారు. అది కూడా అందరు హీరోలు కాదు. ఓటీటీల రేట్లు తగ్గుతున్న వేళ, శాటిలైట్ మార్కెట్ కూడా ఆశాజనకంగా లేని ఇవ్వాల్టి పరిస్థితుల్లో పారితోషికాలు తగ్గించుకోవాలన్న డిమాండ్ ఇంకాస్త గట్టిగా వినిపిస్తోంది. తాజాగా దర్శకుడు వెట్రిమారన్ కూడా ఇలాంటి సలహానే ఇచ్చారు. హీరోలు పారితోషికాలు తగ్గించుకోవాలని, లేదంటే సినిమా మనుగడ కష్టమవుతుందని, థియేటర్ల వ్యవస్థ కుప్పకూలే ప్రమాదం ఉందని హెచ్చరించారు.
కరోనా తరవాత చిత్రసీమ మరింత ఇబ్బందులకు లోనైందని, థియేటర్లు మూతపడ్డాయని, పరిశ్రమలో అసమతుల్యత ఏర్పడిందని, బడ్జెట్లు పెరిగాయని, దాంతో నిర్మాతలు మరింత నష్టపోతున్నారని, ఈ పరిస్థితి చక్కబడాలని సూచించారు. నిజానికి ఈ విషయంలో హీరోలని పూర్తిగా తప్పుపట్టలేం. కొంతమంది నిర్మాతలు కాంబినేషన్ల మోజులో పడి, హీరోల మార్కెట్ కి మించి రెమ్యునరేషన్లు ఇస్తున్నారు. కొంతమంది ఓటీటీల్ని నమ్ముకొని మునిగిపోతున్నారు. ఓ సినిమా హిట్టయితే, పారితోషికాల్ని పెంచుకొనే వెసులు బాటు, అవకాశం హీరోలకు ఉన్నప్పుడు, ఓ సినిమా ఫ్లాప్ అయితే పారితోషికాన్ని తగ్గించే ఛాన్స్ నిర్మాతల చేతుల్లో ఉండాలి. అసలు పారితోషికాలే పక్కన పెట్టి సినిమాల్లో వాటాలు తీసుకొని పని చేయడానికి హీరోలు ముందుకు వస్తే అది ఇంకా మంచిది. చిత్రసీమ బంగారు బాతు. దాన్ని జాగ్రత్తగా కాపాడుకోవాలి. ఒకేసారి మింగేద్దాం, కోటాను కోట్లు సంపాదించేద్దాం అంటే మొదటికే మోసం వస్తుంది. ఈ విషయంలో హీరోలు, నిర్మాతలూ ఇద్దరూ బాలెన్స్ పాటించాలి.