మెగా అభిమానుల అదృష్టం ఏమిటంటే.. చిరంజీవి రీ ఎంట్రీ ఇచ్చాక ఇంకాస్త జోష్ తో సినిమాలు చేయడం. కొత్త దర్శకులతో చిరు ఉత్సాహంగా పని చేస్తున్నారు. తన దగ్గరకు ఎవరు కథ తీసుకొచ్చినా ఓపిగ్గా వింటున్నారు. ‘నీ దగ్గర ఏమైనా కథ ఉంటే చెప్పు’ అని అడిగి మరీ… కథలు రాయించుకొంటున్నారు.
ఇదంతా ఓకే. అయితే.. చిరుని ఇప్పుడు ఎలా చూపించాలన్నదే ఆయా దర్శకుల ముందున్న పెద్ద టాస్క్. వింటేజ్ చిరుని చూపించాలా? లేదంటే కొత్తగా, ఈ జనరేషన్‌కు తగ్గట్టుగా చిరు పాత్రని తీర్చిదిద్దాలా? అనే విషయమై మల్లగుల్లాలు పడుతున్నారు. వింటేజ్ లుక్ అంటే.. ఘరానా మొగుడు, రౌడీ అల్లుడు.. ఆ రోజుల్లో చిరంజీవి పాత్రలు ఎలా ఉండేవి, ఆయన డ్రెస్సింగ్ స్టైల్, కామెడీ టైమింగ్.. ఇవన్నీ ఈ జనరేషన్‌కు గుర్తు చేయడం అన్నమాట. నిజానికి చిరుని వింటేజ్ లుక్‌లో చూడడమే ఫ్యాన్స్‌కు ఇష్టం. కాకపోతే.. ‘వాల్తేరు వీరయ్య’తో ఆ కోరిక తీరిపోయింది. వాళ్లకు ఇప్పుడు చిరుని కొత్త స్థాయిలో చూడాలి. కొత్త కోణంలో చూడాలి. కొత్త పాత్రల్లో చూడాలి. ఆ బాధ్యత దర్శకులు తీసుకొంటే మంచిది.
రజనీకాంత్, కమల్ హాసన్ లాంటి స్టార్లు మెల్లమెల్లగా మారుతున్నారు. విక్రమ్ లో కమల్ కి హీరోయిన్ లేదు. ఆయన వయసుకి తగ్గ పాత్రలో కనిపించారు. ఆయన కెరీర్ లో అతి పెద్ద హిట్ గా మారింది. ‘జైలర్’లో రజనీకి డ్యూయెట్ కూడా లేదు. మెరిసిన జుత్తుతోనే దర్శనమిచ్చారాయన. గత పదేళ్లలో రజనీకి ‘జైలర్’కి మించిన హిట్ లేదు. దానికి కారణం రజనీ, కమల్… కొత్తగా కనిపించడమే. ఫ్యాన్స్‌కు ఇప్పుడు ఆ కొత్తదనమే కావాలి. వింటేజ్ లుక్‌లో.. వాళ్లు తమ హీరోల్ని చాలాసార్లు చూశారు. మళ్లీ చూడాలనుకోవడం లేదు. ఇప్పటి సినిమా మేకింగ్ స్టైల్ మారింది. ఇప్పటి ఆడియన్స్ వేరు. అప్పటి ఆడియన్స్ వేరు. థియేటర్లకు వచ్చేవాళ్లలో పాతికేళ్ల లోపు వాటా 75 శాతం వరకూ ఉంటుంది. మెజార్టీ మనసుల్ని గెలచుకోవడమే ఈనాటి బాక్సాఫీస్ సక్సెస్ సీక్రెట్. చిరంజీవి ఒక్కడే కాదు. వెంకీ, బాలయ్య, నాగ్… వీళ్లంతా మారాల్సిందే.
చిరుతో ‘దసరా’ ఫేమ్ శ్రీకాంత్ ఓదెల ఓ సినిమా చేస్తున్నాడు. ఇందులో వింటేజ్ చిరంజీవిని ఎట్టిపరిస్థితుల్లోనూ చూపించనని ముందే స్టేట్మెంట్ ఇచ్చారాయన. తన కలల్లో చిరు ఎలా ఉండేవాడో.. అలానే చూపిస్తానని, చిరంజీవి అంటే తనకు అభిమానమని, అయితే ఆ అభిమానం సెట్ బయటే కాని, కెమెరాముందుకు వచ్చాక చిరుని తన పాత్రలానే చూస్తానని చెప్పేశాడు శ్రీకాంత్. ఇలాంటి స్టేట్ మెంట్ ఇవ్వడానికి చాలా ధైర్యం కావాలి. పైగా కుర్ర దర్శకులకు. ఆ ధైర్యమే చేశాడు శ్రీకాంత్. ఇప్పుడు అనిల్ రావిపూడి కూడా అదే మాట అంటున్నాడు. చిరంజీవికి ఓ స్టైల్ అంటూ ఉందని, ఆయన బలాన్ని వాడుకొంటూ, తనదైన శైలిలో చిరంజీవిని తెరపై ఆవిష్కరిస్తానని ఫ్యాన్స్ కు మాట ఇచ్చాడు. ప్రేక్షకులు చిరుని వింటేజ్ లుక్‌లో చూడడానికి ఇష్టపడతారా, లేదంటే కొత్తగా చూడడానికి ఇష్టపడతారా అనేది చెప్పలేమని, సినిమా కథని, అందులో హీరో పాత్రని తీర్చిదిద్దిన విధానంపై ఆధారపడి ఉంటుందని రావిపూడి చెబుతున్నాడు. ‘ఆచార్య’లో చిరు ఏం వింటేజ్ లుక్‌లో కనిపించలేదు. కొరటాల ఆ పాత్రని కొత్తగానే డిజైన్ చేయాలని చూశాడు. ఆఖరికి హీరోయిన్ ని కూడా పక్కన పెట్టాడు. అయినా సరే, జనం చూడలేదు. ఈతరం దర్శకులు తెలుసుకోవాల్సిన నీతి అదే.
యేడాదికి కనీసం రెండు సినిమాలు పూర్తి చేయాలన్న లక్ష్యంతో ముందుకు వెళ్తున్నాడు చిరు. అందుకే యువ దర్శకులు ఆయన వెంట పడుతున్నారు. చిరు డేట్లు అందుకోవడం, కథలతో ఆయన్ని మెప్పించడం ఎంత కష్టమో, అభిమానుల ఆశలు, అంచనాలకు తగ్గట్టుగా ఆయన పాత్రల్ని డిజైన్ చేయడం కూడా అంతే కష్టం. ఆ టాస్క్‌ని యువతరం ఎలా తీసుకొంటుందో మరి.