రాక రాక సినిమాలపై ప్రేమొచ్చింది పవన్‌కు. 2009 ఎన్నికల కోసం రాజకీయాలతో బిజీ అయిన పవన్… ఆ తరవాత కాస్త బ్రేక్ ఇచ్చి, సినిమాలపై దృష్టి పెట్టాడు. రెండేళ్ల వ్యవధిలో నాలుగు సినిమాలు పూర్తి చేయాలని భావించాడు. అయితే పవన్ ప్లానింగ్ పై కరోనా పెద్ద దెబ్బ కొట్టింది. లాక్ డౌన్ వల్ల, షూటింగులు ఆగిపోయాయి. వరుసగా సినిమాపై సినిమా చేద్దామన్న పవన్ ఆశలు గల్లంతయ్యాయి. వకీల్ సాబ్ ని పూర్తి చేయడం పవన్ ముందున్న ప్రధాన లక్ష్యంగా మారింది.
షూటింగులకు మళ్లీ వాతావరణం అనుకూలించడంతో, మెల్లమెల్లగా స్టార్లంతా బరిలోకి దిగుతున్నారు. పవన్ సైడ్ నుంచి కూడా అంతా ఓకే. వచ్చే నెలలోనే `వకీల్ సాబ్` షూటింగ్ మొదలుకానుంది. పవన్ కూడా బరిలో దిగడానికి సిద్ధంగానే ఉన్నాడు. కాకపోతే.. పవన్ ఫిట్ నెస్పైనే దర్శకుల బెంగ. షూటింగుల కోసం కాస్త బరువు తగ్గి ఇది వరకటి లుక్ లోకి వచ్చిన పవన్, లాక్డౌన్ తో మళ్లీ బరువు పెరిగాడు. గెడ్డం, జుత్తూ పెంచి – హీరో లుక్‌కి చాలా దూరం నిలబడ్డాడు. పవన్ ఇది వరకటి షేప్ లోకి రావడానికి కాస్త టైమ్ పడుతుంది. ఇప్పటి నుంచి పవన్ తన ఫిట్ నెస్‌పై దృష్టి పెడితే తప్ప – షూటింగులు మొదలయ్యేసరికి ఫిట్ గా మారడు. కానీ.. పవన్ ఫిట్ నెస్ పై ఏమాత్రం గురి పెట్టలేనట్టు తెలుస్తోంది. పైగా పవన్ ఇప్పుడు దీక్షలో ఉన్నాడు. ఈ సమయంలో.. ఫిట్ నెస్ గురించి ఆలోచించడం కూడా కష్టమే. వకీల్ సాబ్ లో లుక్ కీ, ఇప్పటి లుక్ కీ చాలా తేడా వుంది. ఆ విషయం గుర్తు చేసి, ఫిట్ నెస్ పై దృష్టి పెట్టమని సలహా ఇవ్వడానికి దర్శకులకూ, నిర్మాతలకూ ధైర్యం సరిపోవడం లేదు. పవన్ తనంతట తాను గ్రహించి, మళ్లీ కసరత్తులు మొదలెడితే గానీ, హీరో లుక్ లోకి మారడు. పవన్ కోసం ప్రత్యేకమైన ట్రైనర్ ని, లుక్ ని మార్చాలని దిల్ రాజు భావిస్తున్నట్టు సమాచారం. మరోవైపు క్రిష్‌కీ ఇదే ఆలోచన వచ్చింది. కానీ.. దాన్ని పవన్ దృష్టికి తీసుకెళ్లడానికి ఆలోచిస్తున్నారు.