కరోనా ప్రభావంతో ఇప్పట్లో థియేటర్లు తెరచుకునే పరిస్థితి కనిపించడం లేదు. ఒకవేళ థియేటర్లు ప్రారంభమైనా ప్రేక్షకుల జోరు మునుపటిలా ఉంటుందో లేదో తెలియని పరిస్థితి. ఇప్పుడు సినిమాకి ప్రత్యామ్నాయంగా కనిపిస్తోంది ఓటీటీ వేదికలే. అమెజాన్ ప్రైమ్ వీడియో, నెట్ఫ్లిక్స్, హాట్స్టార్, జీ5, ఆహా… ఇలా పలు ఓటీటీ వేదికలు ప్రేక్షకుడి దగ్గరికే వినోదాన్ని తీసుకొస్తున్నాయి.
అయితే టాలీవుడ్ కి వచ్చేసరికి ఓ సమస్య ఏర్పడింది. కంటెంట్ ఎవరిస్తారు?? ఇప్పటికే తెలుగు వెబ్ సిరిస్ లు కొన్ని ఓటీటీలో వున్నాయి. కానీ వీటికి సరైన ఆదరణ లేదనే చెప్పాలి. కారణం స్టార్ బ్రాండ్ లేకపోవడం. స్టార్ అంటే చిరంజీవి, మహేష్ బాబు, పవన్ కళ్యాణ్ అక్కర్లేదు. ఒక స్టార్ డైరెక్టర్ ముందుకు వచ్చి ఓ వెబ్ మూవీ గానీ సిరిస్ గానీ అదించినా చాలు.
బాలీవుడ్ లో ఇది ఆరంభంలోనే జరిగింది. సైఫ్ అలీ ఖాన్, ఇమ్రాన్ హాష్మి లాంటి స్టార్లు వెబ్ కి షిఫ్ట్ అయిపోయి దాని వాల్యు పెంచారు. ఇక దర్శకుల్లో అనురాగ్ కశ్యప్, కరణ్ జోహార్, సుజిత్ సర్కార్ లాంటి ఒరిజినల్ ఫిల్మ్ మేకర్స్ ఓటీటీలో సత్తా చాటేశారు.
తెలుగులో ఇది ఇంకా జరగలేదు. తేజ ఈ పనిలో వున్నారని వినిపిస్తుంది. అయితే చాలా మంది దర్శకులు ముందుకు రాకపోవడానికి ఓ కారణం వినిపిస్తుంది. ఓటీటీకి కంటెంట్ ఇవ్వడం అంత ఈజీ కాదు. థియేటర్లో ఓ సౌలభ్యం వుంది. సినిమా చూడాలని డిసైడ్ వచేస్తాడు ప్రేక్షకుడు. రెండున్నర గంట ప్రయాణంలో చాలా డల్ మూమెంట్స్ ని భరిస్తాడు. కానీ వెబ్ మూవీస్ లో ఈ ఛాన్స్ వుండదు. ఇంకొటి థియేటర్ ఎక్స్పిరియన్స్ వేరు. ఆ సౌండింగు, మూమెంట్స్,.. 70ఏంఏం లెక్కే వేరు. కానీ ఇక్కడ టీవీ లాంటి ఓ బుల్లి స్క్రీన్ లో సత్తా చాటాలి. అది అంత తేలిక కాదు.
దీనికి తాజాగా ఉదాహరణ.. .భీష్మ. ఈ సినిమా హిట్. మంచి రివ్యూలు వచ్చాయి. ఈ సినిమా మొన్ననే నెట్ఫ్లిక్స్ లో పెట్టారు. మొదటిసారి చూస్తున్న చాలా మంది.. అసలు ఈ సినిమా హిట్ ఎలా అయిపొయిందని క్వశ్చన్ మార్క్ ఫేస్ పెట్టారు. ఇది వాళ్ళ తప్పు కాదు. ఎంత మంచి కంటెంట్ అయినా బుల్లితెరపై దాని ఎఫెక్ట్ తగ్గిపోతుంది. ఇప్పుడు టాలీవుడ్ లో కొందరి స్టార్ దర్శకుల భయం కూడా అదే. సచిన్ వాంఖడే లో ఆడినట్లు వీధి క్రికెట్ ఆడలేకపోవచ్చు. ఇక్కడ ఓటీటీలని గల్లీ క్రికెట్ తో పోల్చడం ఉద్దేశం కాదు కానీ.. థియేటర్ లెక్కే వేరని మాత్రం చెప్పకతప్పదు. అయితే ఎంచుకున్న సబ్జెక్ట్ లో కొన్ని జాగ్రత్తలు తీసుకొని.. నలుగురు బడా దర్శకులని నుండి నాలుగు వెబ్ సినిమాలు కానీ సీరిస్ లు వస్తే కానీ.. టాలీవుడ్ ఒటీటీ కూడా కళకళ లాడుతుంది.