గౌరీ లంకేశ్ హత్య విషయంలో ప్రధాని మోడీ ఉదాసీనతను నటుడు ప్రకాశ్‌రాజ్ ఖండించిన తీరు దేశాన్ని ఆకర్షించింది. వారు నాకంటే పెద్ద నటులనీ, ఎడతెగని మౌనం పాటిస్తున్నారనీ ప్రకాశ్ రాజ్ ఎద్దేవా చేశారు. ఇంతకూ ఇదంతా చేసింది ఎక్కడంటే వామపక్ష యువజనసంఘమైన డివైఎప్ఐ రాష్ట్ర మహాసభలో! ఇంతోటి నటనకు గాను నాకొచ్చిన అవార్డులు కూడా వారికేఇస్తానని ఆయన అన్నమాటలు అవార్డువాపసీలాగా ప్రచారమైనాయి. దాంతో – అవి నా శ్రమపలితాలు గనక వెనక్కు ఇవ్వను, వారి నటనకు అవార్డులు ఇస్తానని వ్యంగ్యంగా అన్నానంతే అని మళ్లీ వివరణ కూడా ఇచ్చేశారు. గౌరీ లంకేశ్ హత్య జరిగిన సమయంలోనూ ప్రకాశ్ రాజ్ ఇలాగే తీవ్రంగా మాట్లాడారు. ఆయన గౌరి తండ్రి లంకేశ్ శిష్యుడి కింద లెక్క. తన మాటలు బిజెపికి వ్యతిరేకంగా వున్నాయని తెలిసీ ధైర్యంగా మాట్లాడారు. ఒక దశలో పవన్ కళ్యాణ్, మరో దశలో కమల్ హాసన్‌లు కమ్యూనిస్టులపట్ల సానుకూలంగా మాట్లాడ్డం చూశాం. కమల్ అయితే తనకు కాషాయం కన్నా ఎరుపే దగ్గర అన్నారు. పవన్ వారితో కలసి కార్యాచరణకు సిద్ధమన్నారు.ఈ కోవలో ఇప్పుడు ప్రకాశ్ రాజ్ కూడా మాట్లాడ్డం గమనించదగ్గది. అయితే నిజంగా రాజకీయ కార్యాచరణకు వచ్చేసరికి ఎవరు ఎలా వ్యవహరిస్తారు ఏ మేరకు అడుగేస్తారన్నది చూడాల్సిందే.