విజయానికి ప్రతీక విజయదశమి. అయితే ఈ దసరా బరిలో సినిమాలు విజయానికి నోచులేకపోయాయి. సినిమాలకి మంచి సీజన్ అయిన దసరా ఈసారి చప్పగా సాగిపోయింది.
రజనీ ‘వేట్టయన్’ తో దసరా సందడి మొదలైయింది. రజనీతో పాటు అమితాబ్, ఫహద్, రానా లాంటి హేమాహేమిలీ కనిపించిన ఈ సినిమా తెలుగులో ప్రభావాన్ని చూపలేకపోయింది. ఇటు కాన్సెప్ట్ బలంగా లేదు. అటు రజనీ మార్క్ కనిపించలేదు.
గోపీచంద్, శ్రీనువైట్ల కలిసి చేసిన ‘విశ్వం’ ఈ దసరాకి తెలుగులో వచ్చిన పెద్ద సినిమా. ఒకరకంగా సోలో రిలీజ్ అనుకోవాలి. శ్రీనువైట్ల మళ్ళీ కం బ్యాక్ ఇవ్వాలని చాలా మంది కోరుకున్నారు. అటు గోపి కూడా ఈ సినిమాపై చాలా నమ్మకాలు పెట్టుకున్నాడు. కానీ సినిమా ఆశించినంతగా రాలేదు. శ్రీనువైట్ల పాత సినిమాలన్నిటిని గుర్తు చేస్తూ రొటీన్ అనిపించేసింది. రెండురోజుల్లోనే రికివరీ అయిపోయిందనే పోస్టర్లు వేసుకుంటున్నారేకానీ థియేటర్స్ లో చూస్తే ఫుట్ పాల్స్ లేవు. ఇది శ్రీనువైట్ల నుంచి కొరుకునే కం బ్యాక్ అయితే కాదు.
సుధీర్ బాబు ‘మా నాన్న సూపర్ హీరో’ తో వచ్చాడు. ఫాదర్ ఎమోషన్ వున్న సినిమా ఇది. పాయింట్ లో నోవాలిటీ ఉన్నప్పటికీ తెరపైకి వచ్చిన ఎమోషన్ ఆడియన్ కి పట్టలేదు. పైగా స్లో నేరేషన్ ఇబ్బంది పెట్టింది. టోటల్ గా సినిమా ఎంగేజ్ చేయలేకపోయింది.
సుహాస్ ‘జనక అయితే గనక’ కాన్సెప్ట్ ని నమ్ముకున్న సినిమా. కొత్త పాయింటే. ఫ్యామిలీ కోర్ట్ డ్రామాగా తీర్చిదిద్దారు. కొన్ని సీన్స్ నవ్వించగలిగాయి. అయితే ఇందులో క్రౌడ్ ఫుల్లర్ ఫ్యాక్టర్ లేదు. దీంతో థియేటర్స్ ఆడియన్స్ దృష్టిని ఆకర్షించలేకపోయింది.
డబ్బింగ్ సినిమాగా వచ్చిన మార్టిన్ ని ఆడియన్స్ పట్టించుకోలేదు. పైగా సినిమాకి పూర్తి నెగిటివ్ రివ్యూలు వచ్చాయి. తలాతోక లేని సినిమా అనే కామెంట్లు వినిపించాయి. ఆలియా భట్ జిగ్రా తో వచ్చింది. ప్రిజన్ బ్రేక్ జోనర్ లో వచ్చిన ఈ సినిమాలో ఆలియా నటనకి మంచి మార్కులు పడ్డాయేకానీ కథ, కథనాలు ప్రేక్షకులని అలరించలేకపోయాయి.
మొత్తనికి ఈ దసరా సీజన్ ని సినీ పరిశ్రమ సరిగ్గా ఉపయోగించలేకపోయింది. సరైన క్రేజ్ వున్న సినిమాలు రాలేదు. వచ్చిన సినిమాలు చేతులెత్తేశాయి.