గోవిందుడు అందరి వాడేలే తరవాత… యధావిధిగా కాస్త గ్యాప్ తీసుకొన్నాడు కృష్ణవంశీ! ఆ తరవాత చేసిన సినిమా నక్షత్రం. సందీప్‌కిషన్, సాయిధరమ్ తేజ్, ప్రకాష్‌రాజ్, తనీష్, ప్రగ్యా జైస్వాల్, రెజీనా – ఇలా తారలతో తళతళలాడిపోయింది. రోజుకో లుక్, స్టిల్‌లో ప్రచారం కూడా ఆర్భాటంగానే చేశారు. యువ హీరోలున్నారు, పైగా పోలీస్ కథ.. దాంతో ఖడ్గంలాంటి సినిమా అవుతుందని వీర వంశీ ఫ్యాన్స్ కలలుకన్నారు. సందీప్‌కిషన్, సాయిధరమ్ తేజ్, తనీష్.. ఇలా ఏ ఒక్కరూ – కథేంటి? అని అడక్కుండానే సినిమా ఒప్పేసుకొన్నారు. సాయిధరమ్ తేజ్ అయితే పారితోషికం కూడా తీసుకోకుండా ఈ సినిమా ఒప్పుకొన్నాడు. కథానాయికలైతే ఎగిరి గంతేశారు. కృష్ణవంశీ సినిమాలో ఒక్క ఫ్రేమ్‌లో కనిపించినా అది మహద్భాగ్యం అన్నట్టు సంతోషపడిపోయారు. ఇన్ని ఫ్లాపులు ఇచ్చినా ప్రేక్షకులు, సగటు కృష్ణవంశీ అభిమానులు కూడా.. `ఈసారేదో మ్యాజిక్ చేసేలానే ఉన్నాడు` అని ఆశ పడ్డరు.
అయితే ఈ అశలన్నీ.. అంచనాలన్నీ కుప్పకూల్చేశాడు కృష్ణవంశీ. కథలో, టేకింగ్‌లో, క్యారెక్టరైజేషన్లో ఎక్కడా కృష్ణవంశీ మార్క్ కనిపించలేదు. పాటల్లో మెరుపుల్లేవు. షాట్ డివిజన్లో వంశీ ఛాయలెక్కడా కనిపించలేదు. ఇప్పటి వరకూ వంశీకీ చాలా ఫ్లాపులు తగిలాయి. డేంజర్లాంటి డిజాస్టర్లున్నాయి. కానీ నక్షత్రం దాన్ని కూడా మించిపోయింది. ప్రతీ సీన్లోనూ వంశీ తాలుకూ నిర్లక్ష్యం కనిపించడంతో.. ఆయన ఫ్యాన్స్ కూడా ఉసూరుమంటున్నారు. వంశీ గోల్డెన్ డేస్ అయిపోయినట్టే. వంశీ పేరు చెబితే.. ఎగిరి గంతేసే వాళ్లందరికీ ఈ సినిమా ఓ హెచ్చరిక. వంశీకి కూడా. రివ్యూలు వంశీ అహంపై దెబ్బకొట్టి ఉండొచ్చు. విమర్శకులే కాదు.. ప్రేక్షకులదీ అదే మాట. ఎంత గొప్ప దర్శకుడైనా – పేలవమైన కథా కథనాలతో సినిమా తీస్తే… ప్రేక్షకులు చీదరించుకొంటారన్న విషయం అర్థమవుతూనే ఉంది. సినిమా చూసొచ్చిన ప్రేక్షకుల ముందు మైక్ పెడుతుంటే నిర్దాక్షణ్యంగా ఈసినిమాని తిట్టిపోస్తున్నారు. కనీసం అవి చూసైనా వంశీలో మార్పు మొదలవుతుందేమో చూడాలి.