మోడీ ప్రభుత్వం తన అభిప్రాయాలని, ఆలోచనలని, హిందూ భావజాలాన్ని బలవంతంగా దేశప్రజల మీద రుద్దుతుందనే అపవాదు, విమర్శలు చాలా మూటగట్టుకొంది. అటువంటి ప్రయత్నాల వలన అది చేస్తున్న మంచిపనులు, సంస్కరణలు అన్నీ తుడిచిపెట్టుకుపోయి చెడ్డపేరు సంపాదించుకొంటోంది. బిహార్ శాసనసభ ఎన్నికలలో భాజపా ఓడిపోవడానికి ‘మత అసహనం’ కూడా ఒక కారణమని అందరికీ తెలుసు. తన అభిప్రాయాలని బలవంతంగా ప్రజల మీద రుద్దాలని చూస్తే దాని వలన ప్రజల నుంచి వ్యతిరేకత ఎదురవుతుందని అనుభవపూర్వకంగా తెలుసుకొన్నప్పటికీ మోడీ ప్రభుత్వ తీరులో మార్పు కలుగకపోవడం విచిత్రమే.
ప్రపంచ యోగా దినోత్సవాన్ని పురస్కరించుకొని జూన్ 18 నుండి 24 వరకు దేశవ్యాప్తంగా యోగాభ్యాస శిక్షణా కార్యక్రమాలు జరిగాయి. దానిలో వివిధ ప్రభుత్వ, ప్రైవేట్ సంస్థలు పాల్గొన్నాయి. వాటిలో ఐ.ఐ.టి. రూర్కెలా కూడా ఒకటి. ఒక మంచి పనిలో అందరూ భాగస్వాములు అవడం చాలా గొప్ప విషయమే. కానీ వారం రోజులు పాటు సాగిన ఆ యోగా శిక్షణా కార్యక్రమాలకి హాజరుకాని ఐ.ఐ.టి. రూర్కెలా విద్యార్ధులపై ఆ సంస్థ అధికారులు క్రమశిక్షణ చర్యలు తీసుకోవడానికి సిద్దం అవుతుండటమే ఎవరూ హర్షించలేరు.
ఆ కార్యక్రమానికి హాజరుకాని విద్యార్ధుల జాబితాలను తయారుచేసే పనిలో పడ్డారు ఆ సంస్థ అధికారులు. దీనిపై విద్యార్ధులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. చదువులు, పరీక్షలు కారణంగా క్షణం తీరిక లేకుండా ఉండే తమని ఇటువంటి కార్యక్రమాలలో తప్పనిసరిగా పాల్గొనాలని లేకుంటే క్రమశిక్షణ చర్యలు తీసుకొంటామని బెదిరించడం సరికాదని అంటున్నారు.
ఇదే విషయంపై ఐ.ఐ.టి. రూర్కెలా డీన్ డి.కె.నౌరియాల్ ని మీడియా ప్రశ్నించగా, “యోగా శిక్షణా కార్యక్రమాలకి ఎంతమంది హాజరయ్యారో, మిగిలిన వారు ఎందుకు హాజరు కాలేదో అని తెలుసుకోవడానికి మాత్రమే మేము విద్యార్ధుల హాజరు వివరాలని సేకరిస్తున్నాము. అది కేవలం రికార్డు కోసమే తప్ప విద్యార్ధులపై క్రమశిక్షణ చర్యల కోసం కాదు. యోగా శిక్షణా కార్యక్రమానికి హాజరు కమ్మని మేము ఎవరినీ ఒత్తిడి చేయలేదు. చేయబోము,” అని చెప్పారు.
ఆయన చెపుతున్నదే నిజమనుకొంటే, మళ్ళీ యోగా తరగతులకి విద్యార్ధులు ఎందుకు రాలేదో కారణాలు తెలుసుకోవాలని ఎందుకు ప్రయత్నిస్తున్నారు? అంటే విద్యార్ధులు చెపుతున్నది నిజమేనని అర్ధం అవుతోంది. యోగా తరగతులకి హాజరు కాని విద్యార్ధులపై, 60 శాతం కంటే తక్కువ హాజరున్న విద్యార్ధులపై కూడా జరిమానా విధించడం లేదా వారి మార్కులలో కోత విధించబోతున్నట్లు విద్యార్ధులే చెపుతున్నారు. అధికారులు ప్రదర్శించే ఇటువంటి అత్యుత్సాహం వలనే మోడీ ప్రభుత్వం విమర్శలు ఎదుర్కోవలసి వస్తోంది. చెడ్డపేరు వస్తోంది.