కాంగ్రెస్ పార్టీలో ప్రజాస్వామ్యం ఎక్కువ అని సెటైరిక్‌గా చెప్పుకుంటూ ఉంటారు. ఎందుకంటే.. ఎవరి అజెండాను వారు అమలు చేస్తూ.. పార్టీ హైకమాండ్ నిర్ణయాన్ని కూడా అడ్డగోలుగా విమర్శించేస్తూ ఉంటారు. పార్టీ అవసానదశకు చేరినా.. పార్టీ నేతల ఈ తీరు మారలేదని.. తాజాగా కోమటిరెడ్డి వెంకటరెడ్డి విమర్శల ద్వారా స్పష్టమయింది. ఆయన సోదరుడు ఇప్పటికే బీజేపీ బాట పట్టారు. పీసీసీ ఇవ్వకపోతే తానూ బీజేపీకే పోతానన్న సంకేతాలను తరచూ గడ్కరీతో భేటీ అవడం ద్వారా కోమటిరెడ్డి కూడా పంపారు. కాంగ్రెస్ పార్టీ హైకమాండ్ ఈ బ్లాక్‌మెయిల్‌కు లొంగినట్లుగా లేదు. రేవంత్ రెడ్డికి కిరీటం ప్రకటించింది.
దాంతో కోమటిరెడ్డి రెచ్చిపోయారు. నేరుగా హైకమాండ్‌పైనే విమర్శలు చేశారు. పీసీసీ అధ్యక్ష పదవిని అమ్ముకున్నారని తూలనాడటం ప్రారంభించారు. ఆయన ఓ పక్కా రాజకీయ ఎజెండా ప్రకారం.. విమర్శలు చేసినట్లుగా కాంగ్రెస్ నాయకులకు అర్థమైపోయింది. ఈ క్రమంలో పార్టీ హైకమండ్ కూడా ఆయన చేసిన వ్యాఖ్యల గురించి వివరాలు సేకరించింది. కానీ చర్యలు తీసుకుంటారా లేదా అన్నది ఇప్పుడు కీలకం. గతంలో కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి కూడా ఇంత కంటే దారుణమైన వ్యాఖ్యలు చేశారు. కానీ.. చర్యలు తీసుకోలేదు. తీసుకుంటామని హడవుడి చేశారు. ఏమీచేయలేరన్న అలుసుతోనే కోమటిరెడ్డి ఇలా రెచ్చిపోయినట్లుగా భావిస్తున్నారు.
కోమటిరెడ్డిపై ఇప్పుడు చర్యలు తీసుకోకపోతే.. అలాంటి అసంతృప్తి స్వరాలు పెరిగిపోతాయి. తాము కోరుకున్న పదవి రాని ప్రతి ఒక్క నాయకుడు … సొంత పార్టీని ఎన్ని మాటలయినా అనేందుకు వెనుకాడరు. అందుకే ఇప్పుడు కోమటిరెడ్డిపై గట్టి చర్య తీసుకోవాలన్న డిమాండ్ ఆ పార్టీలో వినిపిస్తున్నాయి. పార్టీ నుంచి సస్పెండ్ చేస్తేనే ఇతరులకు సందేశం పంపినట్లవుతుందని అంటున్నారు. ప్రస్తుతం రేవంత్ రెడ్డికి పీసీసీ ఇచ్చినందున.. క్యాడర్లో ఉత్సాహం ఉందని.. ఇలాంటి డైవర్షన్ రాజకీయాల వల్ల.. అది చల్లబడిపోతే.. మొత్తంగా పార్టీకే ప్రమాదమని అంటున్నారు. కాంగ్రెస్ హైకమాండ్ కూడా… ఈ విషయంపై ఆలోచించి కఠిన నిర్ణయం తీసుకుంటేనే… టీఆర్ఎస్ పై పోరాటానికి… కొత్త నాయకత్వానికి వెసులుబాటు ఉంటుంది. లేకపోతే.. పార్టీ అంతర్గత సమస్యలతో కొట్లాటలకే సమయం సరిపోతుంది.