విధి నిర్వహణలో తప్పుడు పనులు చేయడమే కాకుండా ప్రభుత్వంపై విమర్శలు చేస్తున్న మాజీ సీఐడీ డీజీ పీవీ సునీల్ కుమార్ పై క్రమశిక్షణా చర్యలకు రంగం సిద్ధమైనట్లుగా తెలుస్తోంది. రఘురామ చేసిన ఫిర్యాదులో ఆయనపై కేసు నమోదు అయింది. దీన్ని తప్పు పడుతూ సోషల్ మీడియాలో స్పందించారు. దీంతో పాటు ఆయన సుప్రీంకోర్టు తీర్పునకు వక్రభాష్యం చెప్పారు.
వీటితో పాటు ఆయనపై గతంలో కేంద్రం అనేక సార్లు ఆగ్రహం వ్యక్తం చేసింది. పీవీ సునీల్ పై చర్యలు తీసుకోవాలని పలుమార్లు ఆదేశాలు పంపింది. కానీ ఇక్కడి ప్రభుత్వం ఆయనకు పూర్తి స్థాయిలో అండగా నిలిచింది. చివరికి తప్పని పరిస్థితుల్లో ఆయనను సీఐడీ చీఫ్ పోస్టు నుంచి బదిలీ చేశారు కానీ…. అంతకు మించి చర్యలు తీసుకోలేదు. మత సంస్థ నడపడం.. హిందువులకు వ్యతిరేకంగా ప్రసంగాలు చేయడం వంటివి చాలా చేశారు. ఇవన్నీ ఆన్ రికార్డు కేంద్రం వద్ద ఉన్నాయి. అందుకే చర్యలు తీసుకోవాలని రాష్ట్రానికి లేఖలు రాశారు.
అదే సమయంలో సీఐడీ చీఫ్ గా ఆయన మానవహక్కుల ఉల్లంఘనకు పాల్పడ్డారు. అరెస్టులు చేసిన తర్వాత ఎఫ్ఐఆర్లు బయటపెట్టడం దగ్గర నుంచి ప్రతి విషయంలోనూ ఆయన పెట్టిన కేసులు వివాదాస్పదమయ్యాయి. అన్నీ తప్పుడు కేసులే. వాటిపై ఓ కమిషన్ వేసే ఆలోచనలో ప్రభుత్వం ఉంది. వీటన్నింటినీ పరిగణనలోకి తీసుకుని ఆయనపై క్రమశిక్షణా చర్యలకు రంగం సిద్ధమయినట్లుగా తెలుస్తోంది.