వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పార్లమెంటరీ పార్టీ నేత విజయసాయిరెడ్డి తన పదవిని కోల్పోయే ప్రమాదంలో పడ్డారు. ఆయనపై అనర్హతా వేటు కోసం ఫిర్యాదు చేసేందుకు టీడీపీ సిద్ధమవుతోంది. ఇలాంటి విషయంలో ఏ మాత్రం సహించని వెంకయ్యనాయుడు.. రాజ్యసభ చైర్మన్గా ఉన్నారు కాబట్టి.. నిర్ణయం కూడా వెలువడే అవకాశం ఉంది. విజయసాయిరెడ్డిపై.. అనర్హతా వేటు ముప్పు రావడానికి స్వయంగా.. సీఎం జగన్మోహన్ రెడ్డే కారణం కావడం ఇక్కడ విశేషం.
విజయసాయికి పదవి తెచ్చి పెట్టిన గండం..!
ఢిల్లీలో ఏపీ ప్రభుత్వ ప్రతినిది పదవి నుంచి హఠాత్తుగా ప్రభుత్వం తొలగిస్తూ.. గురువారం ఉత్తర్వులు జారీ చేసింది. ఇది చాలా మందికి ఆశ్చర్యం అనిపించింది. కానీ రాజ్యాంగ నిపుణులకు మాత్రం.. ఇది పెద్దగా ఆశ్చర్యం అనిపించలేదు. ఎందుకంటే.. ముంచుకొస్తున్న ముప్పును… విజయసాయిరెడ్డికి ఏర్పడిన రాజ్యసభ పదవీ గండాన్ని తప్పించుకోవడానికి .. ఉన్న పళంగా.. ఆయనకు ఇచ్చిన పోస్టును ఉపసంహరిస్తూ ప్రకటన చేశారు. కానీ ఇది నిబంధనలకు విరుద్ధం. ఎంపీగా ఉన్న వ్యక్తి.. పరస్పర విరుద్ధ ప్రయోజనాలను ప్రభుత్వం నుంచి పొందకూడదు. ప్రజాప్రాతినిధ్య చట్టం 120 (1) ప్రకారం.. ఆఫీస్ ఆఫ్ ప్రాఫిట్ కిందకుఆ పదవి వస్తుంది. గతంలో.. ఇలా ప్రయోజనాలను పొందిన వారు అనర్హతకు గురయ్యారు. ఆర్టికల్ 103కింద ఆయనను అనర్హుడిగా ప్రకటించడానికి ఈసీకి అధికారం ఉంది.
ఉన్న పళంగా పదవి పీకేసింది అందుకే..!
వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేతకు విజయసాయిరెడ్డి.. కుడిభుజం లాంటి వారు. ఆయనకు పదవులు ఇస్తారే కానీ.. తీసేయడం అంటూ ఉండదని.. వైసీపీలో అందరికీలో తెలుసు. అయితే హఠాత్తుగా పదవిని తీసేయడానికి అసలు కారణం.. రాజ్యసభ సభ్యత్వానికి ఎసరు రావడమేనని.. ఉత్తర్వులు వచ్చిన తర్వాత కాసేపటికి అందరికీ తెలిసిపోయింది. కానీ… జీవోను ఉపసంహరించినంత మాత్రాన.. నియామకం రద్దవుతుందేమో కానీ.. ఆ పదవిని ఆయన ఉన్న కొన్ని రోజులు అనుభవించినట్లే అవుతుంది. విజయ సాయి రెడ్డిని ఢిల్లీలో రాష్ట్ర ప్రభుత్వ ప్రత్యేక ప్రతినిధిగా నియమిస్తూ 22.06.2019న జీవో నెం 68 జారీ చేశారు. విత్ ఇమిడియట్ ఎఫెక్ట్ కింద ఈ నియామకం అమల్లోకి వస్తుందని ఆ జీవోలో పేర్కొన్నారు. అంటే అప్పటి నుంచి ఆయన ఢిల్లీలో ఏపీ ప్రభుత్వ ప్రతినిధే. ఇప్పుడు ఈ నియామకాన్ని రద్దు చేస్తూ 04.07.2018న మరో జీవో ఇచ్చారు. అంటే 13 రోజుల పాటు ఆ పదవిలో విజయ సాయి రెడ్డి వ్యవహరించారు. 13రోజులు ఆఫీస్ ఆఫ్ ప్రాఫిట్ కింద విజయ సాయి రెడ్డి పని చేసినట్లయింది.
చట్టం తెలియదంటే బయటపడొచ్చా…?
ఈ వ్యవహారంలో.. వైసీపీ.. వైఎస్ ఫార్ములానే అనుసరించే అవకాశాలు కనిపిస్తున్నాయి. వైఎస్ గతంలో.. ఇడుపులపాయలో భూముల్ని.. పెద్ద ఎత్తున కొనుగోలు చేసినప్పుడు… చట్టం తెలియదని చెప్పి తప్పించుకునే ప్రయత్నం చేశారు. తెలియకపోవడం నేరం కాదని వాదించేవారు. ఇప్పుడు.. వైసీపీ కూడా.. అదే వాదించే అవకాశాలున్నాయన్న ప్రచారం జరుగుతోంది. ఆఫీస్ ఆఫ్ ప్రాఫిట్ అనే దాని గురించి తెలియకనే విజయసాయి నియామం చేశామని.. తెలిసిన తర్వాత తీసేశామని.. వాదించే అవకాశం ఉంది. అయితే చట్టం తెలియకపోవడం అనేది…. ప్రతీ అంశానికీ ఉపయోగపడే ఆప్షన్ కాదనేది రాజకీయ నేతలు చెబుతున్న మాట.
వెంకయ్యనాయుడు దగ్గరకు చేరితే వేటే..!?
ఈ వ్యవహారాన్ని అత్యంత పకడ్బందీగా… డీల్ చేయాలని.. టీడీపీ న్యాయవిభాగం భావిస్తోంది. పక్కా ఆధారాలతో అనర్హతా వేటు వేయించాలని ప్రయత్నిస్తోంది. ముందుగా.. రాజ్యసభ చైర్మన్ కు అన్ని వివరాలతో ఫిర్యాదు చేయనున్నారు. గతంలో ఇచ్చిన తీర్పులు.. అనర్హతకు గురైన వారి వివరాలు ఇలా అన్నింటితో వెంకయ్యకు ఫిర్యాదు చేయబోతున్నారు. వెంకయ్యనాయుడు..నాన్చే రకం కాదు.. ఏదో ఒకటి తేల్చేసేవారే కాబట్టి… విజయసాయి భవితవ్యం ఇప్పుడు.. వెంకయ్య చేతుల్లో ఉందనుకోవచ్చు.