రేటింగ్: 2.5/5
ఏ కథకైనా
ప్రారంభం
ఓ ట్విస్టు
ముగింపు – ఇవి పక్కాగా ప్లాన్ చేసుకుంటే చాలు. కథకి ఇవి చాలా అవసరం కూడా. కథలోకి నడిపించే ప్రారంభం, ఆసక్తికరమైన ఇంట్రవెల్ బ్యాంగు, చివర్లో అదిరిపోయే ట్విస్టుతో ముగింపు – డిస్కోరాజా కథలోనూ ఇవన్నీ కనిపించాయి. అయితే మధ్యలో సినిమాకి అతిముఖ్యమైన `నడక` ఉంటుంది. దాన్ని నిర్లక్ష్యం చేస్తే మాత్రం – సినిమాకి మూలస్థంభాలైన ప్రారంభం, ట్విస్టు, ముగింపు – ఇవన్నీ నీరుగారిపోతాయనడానికి `డిస్కోరాజా` ఓ తాజా ఉదాహరణగా నిలిచిపోయింది.
కథ
లఢక్‌లో, మంచు కొండల్లో గుర్తు తెలియని ఓ మృతదేహం దొరుకుతుంది. దాన్ని శాస్త్రవేత్తలు లాబ్‌కి తరలిస్తారు. తమ ప్రయోగాలకు `సబ్జెక్ట్`లా వాడుకుంటారు. దేవుడి సృష్టిని పునః సృష్టి చేసి, బతికిస్తారు. కానీ.. తనకేం గుర్తుండదు. తనెవరు? ఎక్కడి నుంచి వచ్చాడు? అనే విషయాలు ఓ మిస్టరీగా మారతాయి. అయితే.. ఢిల్లీలో వాసు (రవితేజ) కూడా ఎవరికీ కనిపించకుండా పోతాడు. తన కోసం కుటుంబం మొత్తం బెంగ పెట్టుకుంటుంది. వాసు కోసం ఓ ముఠా గాలిస్తూ ఉంటుంది. ఆ వాసుకీ, శాస్త్రవేత్తలు బతికించిన మనిషీ ఒక్కరేనా? వేర్వేరు అయితే ఇద్దరి మధ్య అనుబంధం ఏమిటి? ముఫ్ఫై ఏళ్ల క్రితం చెన్నైలో గ్యాంగ్ స్టర్ గా వెలిగిన `డిస్కోరాజా` కథేమిటి? అతని కోసం సేతు (బాబీ సింహా) ఎందుకు ఎదురు చూస్తున్నాడు? ఇవన్నీ `డిస్కోరాజా` చూసి తెలుసుకోవాలి.
విశ్లేషణ
ముందే చెప్పినట్టు విఐ ఆనంద్… ఈ కథకు ప్రారంభం, ఇంట్రవెల్ బ్యాంగ్, ముగింపు చాలా చక్కగా రాసుకున్నాడు. లఢక్ నేపథ్యంలో కథని మొదలెట్టిన తీరు ఆకట్టుకుంటుంది. మంచు కొండలు, అక్కడో మృతదేహాం, దాన్ని లాబ్‌కి తరలించడం, ప్రయోగాలు చేయడం – ఇదంతా ప్రేక్షకుడిని తొందరగానే కథలోకి తీసుకెళ్లిపోతుంది. ఇంట్రవెల్ బ్యాంగ్ కూడా పకడ్బందీగా రాసుకున్నాడు. కానీ మధ్యలో నడిచే `నడక` అంత ఆసక్తిగా అనిపించదు. ఎందుకో రవితేజ ఎనర్జీని కాస్త ప్రయోగ శాలకే పరిమితం చేసి – దర్శకుడు మరో ప్రయోగం చేశాడనిపిస్తుంది. రవితేజ నుంచి ఆశించే వినోదం.. తొలి సగంలో కనిపించదు. అయితే వాసు – నభా ఎపిసోడ్లో పూర్వపు రవితేజని చూపించే ఛాన్సుంది. దాన్నీ ఆనంద్ సద్వినియోగం చేసుకోలేదు. ఆ ట్రాక్‌ని కాస్త లాజిక్కులు లేకుండా నడిపాడు. ఉగాదిలో ఎస్వీ కృష్ణారెడ్డి చేసిన పార్ట్‌టైమ్ ఉద్యోగాలన్నీ వరుస పెట్టి `ప్లే` చేసేశాడు. పార్ట్‌టైమ్ లైబ్రేరియన్, పార్ట్ టైమ్ మాస్టారు మామూలే. ఈ పార్ట్ టైమ్ ట్రాఫిక్ కానిస్టేబుల్ ఉద్యోగం ఏమిటో అర్థం కాదు.
లాబులో వెన్నెల కిషోర్ వేసిన పంచ్‌లు అక్కడక్కడ పేలాయంతే. లేదంటే ఫస్టాఫ్‌ని భరించడం ఇంకాస్త కష్టమయ్యేది. సరిగ్గా ఇంట్రవెల్ బ్యాంగ్ పడుతుందనగా – ఓ ట్విస్ట్ ఇచ్చి ఆశ్చర్యపరిచాడు. ఆ మలుపు, దానికి ఇచ్చిన బిల్డప్పు, వెనుక రెచ్చిపోయి కొట్టిన తమన్ ఆర్.ఆరూ.. ఇవన్నీ చూస్తే ఈ స్క్రాప్ ఫస్టాఫ్ వరకే.. సెకండాఫ్ దద్దరిల్లిపోతుందని అనిపిస్తుంది. ఎందుకంటే టైటిల్ జస్టిఫికేషన్‌కి సంబంధించిన డిస్కోరాజా క్యారెక్టరు ద్వితీయార్థంలోనే ఎంటర్ అవుతుంది. కాబట్టి… ఆ ఆశలు, అంచనాలతో ప్రేక్షకుడు
కాస్త `విశ్రాంతి` తీసుకుంటాడు.
అయితే కీలకమైన రెట్రో ఎపిసోడ్‌లోనూ దర్శకుడు తడబడినట్టు అనిపిస్తుంది. విజయ్‌సేతుపతి – రవితేజ `వార్` ఆసక్తిగానే మొదలైనా – చాలా రొటీన్‌గా ముగుస్తుంది. బిరియానీ ఎపిసోడ్ మరీ లాగ్ అయినట్టు అనిపిస్తుంది. లవ్ చాఫ్టర్ కూడా బోరింగ్‌గానే సాగుతుంది. రవితేజ – పాయల్ మధ్య ట్రాక్ ఇంకాస్త భిన్నంగా తీర్చిదిద్దితే బాగుండేది. ఎప్పుడైతే డిస్కోరాజాకి సంబంధించిన ఫ్లాష్ బ్యాక్ ముగుస్తుందో, అప్పుడే క్లైమాక్స్ మనకి అర్థమైపోతుంది. సేతుని సైడ్ చేసి – హీరో పగ తీర్చుకుంటాడన్న అంచనాకి ప్రేక్షకుడు వచ్చేస్తాడు. అక్కడితో ఈ సినిమాని ఆపేయొచ్చు కూడా. కానీ వీఐ ఆనంద్ క్లైమాక్స్‌ని ఇంకాస్త పొడిగించాలనుకున్నాడు. ఓ ట్విస్టు ఇచ్చి – తన తెలివితేటల్ని చూపించాడు కూడా. ఆ ట్విస్టు బాగున్నా, అప్పటికే ఈ కథతో, డిస్కోరాజాతో ప్రేక్షకుడు డిస్కనెక్ట్ అయిపోతాడు. బయటకు వెళ్లిపోవాలనుకున్న ప్రేక్షకుడ్ని కాసేపు దర్శకుడు ఆపగలిగాడు తప్ప, ఈ సినిమాపై అప్పటికే ఏర్పరచుకున్న అభిప్రాయాన్ని మాత్రం మార్చలేకపోయాడు.
నటీనటులు
మీ క్యారెక్టర్లో ఎన్నో షేడ్లూ, 80ల బ్యాక్ డ్రాప్, మీరో డాన్ – ఇలా చెబితే రవితేజకు ఎక్కడలేని కిక్ వచ్చేస్తుంటుంది. బహుశా ఈకథనీ అందుకే ఒప్పుకుని ఉంటాడు. తన లెక్కలకు సరిపడా పాత్రే దక్కింది. దాన్ని రవితేజ పూర్తి స్థాయిలో సద్వినియోగపరచుకున్నాడు కూడా. తను మరింత యంగ్‌గా కనిపించాడు. కానీ ఎనర్జీని మాత్రం చూపించలేకపోయాడు. అదంతా దర్శకుడు అల్లుకున్న స్క్రిప్టులో లోపమే తప్ప, రవితేజలోనిది కాదు. పాయల్, నభా.. ఇద్దరివీ నామమాత్రపు పాత్రలే. పాయల్ కి డైలాగులు ఇచ్చినప్పుడే, ఎక్స్ప్రెషన్స్ ఇచ్చేది కాదు. ఇప్పుడు డైలాగులూ లేవు. ఎక్స్ప్రెషనూ లేదు. నభా.. ఉన్నంతసేపూ గ్లామర్ గానే కనిపించింది. సునీల్ ది నవ్వించే పాత్ర మాత్రం కాదు. ఇక బాబీ సింహా గురించి చెప్పుకోవాలి. తన పాత్రని చాలా స్టైలీష్‌గా డిజైన్ చేశాడు. తన స్క్రీన్ ప్రెజెన్స్ కూడా అద్భుతంగా ఉంది. బాబీ సింహా పాత్రని ఇంకాస్త ఎలివేట్ చేస్తే, డిస్కోరాజా ఏమైపోతాడో అనే భయంతో..
అక్కడక్కడ కాస్త అశ్రద్ధ చేసినట్టు కనిపిస్తుంది.
సాంకేతిక వర్గం
పాటలెలా ఉన్నా ఫర్వాలేదు, ఆర్.ఆర్ మాత్రం గట్టిగా ఉండాలని తమన్‌కి ఒకటికి పది సార్లు చెప్పి ఉంటారు. కేవలం ఆర్.ఆర్‌పై దృష్టి పెట్టాడు. బాలు పాడిన పాట మినహా మరేదీ ఆకట్టుకోదు. లడఖ్ నేపథ్యంలో సన్నివేశాల్ని చాలారిచ్గా తెరకెక్కించారు. సాంకేతిక విలువల పరంగా ఎక్కడా రాజీ పడలేదు. డబ్బుల్ని విచ్చలవిడిగా ఖర్చు చేశారు. ఆనంద్ కథని బాగానే మొదలెట్టాడు. కాకపోతే.. రవితేజ ఇమేజ్‌కి లోబడి, కమర్షియల్ టచ్ ఇచ్చుకుంటూ వెళ్లి, చివరికి రొటీన్ రివైంజ్ డ్రామా తీశాడు.
ఫినిషింగ్ టచ్: ఉస్కో రాజా
రేటింగ్: 2.5/5