తెలంగాణ అసెంబ్లీలో హరీష్ రావును అగ్గిపెట్టే ఎలా ఇబ్బంది పెడుతుందో.. సాగునీటి ప్రాజెక్టుల విషయంలో కేసీఆర్ ను రోజా చేపల పులుసు అలా ఇబ్బంది పెడుతోంది. సాగునీటి ప్రాజెక్టులపై చర్చ జరిగిన ప్రతీ సారి కాంగ్రెస్ నేతలు కేసీఆర్ గతంలో రోజా ఇంట్లో విందు తర్వాత మాట్లాడిన మాటల్ని గుర్తు చేస్తున్నారు. సీఎం రేవంత్ రెడ్డి గతంలో రోజా ఇంట్లో చేపల పులుసు తిని రాయలసీమను రత్నాల సీమను చేస్తానని హామీ ఇచ్చారని ..దానికి తగ్గట్లుగానే తెలంగాణ నీరు తరలించుకుపోవడానికి సహకరించారని ఆరోపణలు చేస్తున్నారు. ఒక సారి కాదు.., ఒక్క రేవంత్ కాదు.. మాట్లాడిన వాళ్లంతా ఏదో ఓ సందర్భంలో రోజా చేపల పులుసు అంశాన్ని తెరపైకి తెస్తున్నారు.
నిజానికి కేసీఆర్ సీఎంగా ఉన్న సమయంలో రాయలసీమ ఎత్తిపోతల.విషయంలో పెద్దగా పట్టించుకోలేదు. ఆ ప్రాజెక్టుకు అనుమతులు లేకపోయినా అభ్యంతరం చెప్పలేదు. ఆ ప్రాజెక్టు మెగా కృష్ణారెడ్డికి దక్కిందనో మరో కారణమో కానీ.. ఊరకుండిపోయారు. ఇదే విషయాన్ని కాంగ్రెస్ నేతలు ఎక్కువగా ప్రస్తావించారు. రాయలసీమ ఎత్తిపోతల పథకం టెండర్లు ఖరారవుతున్నా కేసీఆర్ ప్రభుత్వం పట్టించుకోకపోగా.. కావాలనే టెండర్లకు సహకరించారని.. అనుమతులు లేకపోయినా పనులు చేస్తున్నా.. జగన్తో ఉన్న రహస్య ఒప్పందం కారణంగానే అప్పటి కేసీఆర్ ప్రభుత్వం ప్రాజెక్టుకు సహకరించిందని మంత్రులు ఆరోపించారు.
రాయలసీమ ప్రాజెక్టు టెండర్ల ప్రక్రియ జరుగుతున్న సమయంలోనే కేంద్ర జలశక్తి మంత్రిత్వ శాఖ ముఖ్యమంత్రులతో అపెక్స్ కమిటీ సమావేశం నిర్వహించాలనుకుంది. దీనికి హాజరైతే ప్రాజెక్టుకు అభ్యంతరం చెప్పాల్సి ఉంటుంది కాబట్టి కేసీఆర్ ఈ మీటింగ్కు హాజరుకాలేదని మంత్రి ఉత్తమ్ బయట పెట్టారు. మంత్రుల ముప్పేట దాడిని హరీష్రావు ఎదుర్కొన్నారు. ఒకరి తర్వాత ఒకరు మంత్రులు ఆరోపణలు సంధిస్తూంటే ఆయన సమాధానం చెప్పలేకపోయారు. తామే పనులపై స్టే తీసుకొచ్చామని చెప్పుకొచ్చారు. వాస్తవానికి ప్రభుత్వ పిటిషన్ వల్ల దానిపై స్టే రాలేదు. పర్యావరణ అంశంపై ఇతరులు వేసిన పిటిషన్ తో స్టే వచ్చింది.