ఏపీలో సార్వత్రిక ఎన్నికలు ముగియడంతో ఇప్పుడు అందరి దృష్టి పిఠాపురం నియోజకవర్గంనే నెలకొంది. కూటమి గెలుపు అవకాశాలపై ఎంత చర్చ జరుగుతుందో అంతకుమించిన స్థాయిలో పవన్ గెలుపు అవకాశాలపై డిస్కషన్ కొనసాగుతోంది.పవన్ గెలుపు ఖాయమనే విశ్లేషణల నేపథ్యంలో కూటమి అధికారంలోకి వస్తే ప్రభుత్వంలో జనసేనాని రోల్ ఎలా ఉండనుంది..? అని అప్పుడే పిఠాపురం ప్రజానీకం చర్చలు మొదలుపెట్టేసింది.
పవన్ ప్రత్యర్ధిగా పోటీ చేసిన వైసీపీ అభ్యర్థి వంగాగీతను గెలిపిస్తే డిప్యూటీ సీఎం చేస్తానని పిఠాపురం రోడ్ షో లో జగన్ రెడ్డి హామీ ఇచ్చిన సంగతి తెలిసిందే. కానీ, వైసీపీ దారుణ పరాభవం చవిచూస్తుందని, కూటమి అధికారంలోకి వస్తుందని రాష్ట్రవ్యాప్తంగా ప్రచారం జోరుగా జరుగుతోంది. ఇదే జరిగితే కొత్తగా ఏర్పడబోయే ప్రభుత్వంలో పవన్ పాత్ర ఎలా ఉండనుంది..? అనేది ప్రాధాన్యత సంతరించుకుంది.
చంద్రబాబు నేతృత్వంలోని కూటమి అధికారంలోకి వచ్చి పవన్ గెలుపొందితే ఆయనకు కీలకమైన పదవి ఖాయం. ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీలకుండా చేస్తానని మాటిచ్చి కూటమి ఏర్పాటు దిశగా పవన్ తీవ్రంగా కృషి చేశారు. దాంతో కూటమి సర్కార్ ఏర్పడితే క్యాబినెట్ లోకి పవన్ ను తీసుకోవడం ఖాయం.
పవన్ కు కీలక బాధ్యతలు అప్పగించడం ఖాయంగా కనిపిస్తుండటంతో పిఠాపురం ప్రజలు ఇక తమ నియోజకవర్గానికి నిధుల వరద పారుతుందని విశ్వాసం వ్యక్తం చేస్తున్నారు. కొసమెరుపు ఏంటంటే.. వైసీపీ అధికారంలోకి వచ్చినా, కూటమి అధికారంలోకి వచ్చినా పిఠాపురం నియోజకవర్గానికి కీలక పదవులు దక్కడం ఖాయం.