ఏపీలో అధికారంలో ఉన్న సమయంలో జగన్ రెడ్డి చేసిన నిర్వాకాలు ఇతర అసెంబ్లీల్లోనూ హాట్ టాపిక్ అవుతున్నాయి. కర్ణాటక అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల్లో అశోక్ రెడ్డి అనే బీజేపీ సభ్యుడు జగన్ తెచ్చిన వాలంటీర్ల వ్యవస్థను ప్రస్తావించారు. పార్టీ కార్యకర్తలకు ప్రజాధనాన్ని దోచి పెట్టడానికి తెచ్చిన ఈ వ్యవస్ధ ఎంత ప్రమాదకరమో వివరించారు. ఈ వ్యవస్థను ప్రజలు ఎలా తిరస్కరించారో ఎన్నికలు నిరూపించాయన్నారు.ఇదంతా ఎందుకు చెప్పారంటే.. కర్ణాటకలో ఈ వాలంటీర్ల తరహాలో కాకపోయినా.. కొంత మంది కార్యక్తలకు డబ్బులు ఇచ్చి ఉద్యోగం లాంటివి ఏర్పాటు చేశారు.
కాంగ్రెస్ కార్యకర్తలకు ఇస్తున్న ఇలాంటి పదవులపై చర్చ జరిగింది. ప్రజాధనాన్ని దుర్వినియోగం చేస్తున్నారని పథకాలు, గ్యారంటీల అమలుకు డబ్బుల్లేని సమయంలో సొంత పార్టీ కార్యకర్తలకు ఎందుకు డబ్బులు చెల్లించేందుకు ఇలాంటి వారిని నియమిస్తున్నారని విపక్ష సభ్యులు ప్రశ్నించారు. ఈ చర్చలో రేవంత్ రెడ్డి .. ఇండియా టుడే కాంక్లేవ్ లో చేసిన నిధుల సమస్య కు కారణం అంటూ చెప్పిన లెక్కలు కూడా చర్చకు వచ్చాయి. అయితే డీకే శివకుమార్ మాత్రం తమ పార్టీ కార్యకర్తలకు వాలంటీర్ల లాంటి పోస్టులు ఇచ్చి డబ్బులు చెల్లించడాన్ని సమర్థించుకున్నారు.
గ్రామస్థాయిలో కాంగ్రెస్ ప్రభుత్వం అందిస్తున్న పథకాల లబ్దిదారులతో నిరంతరం టచ్ లో ఉండేందుకు .. కాంగ్రెస్సే అంతా ఇస్తుందని చెప్పుకునేందుకు తమ పార్టీ కార్యకర్తల కోసం ఓ వ్యవస్థను కర్ణాటక ప్రభుత్వం ఏర్పాటు చేసింది. వారికి జీతాలు కూడా ప్రభుత్వ ఖజానా నుంచి చెల్లిస్తున్నారు. అందుకే ఈ అంశంపై విస్తృత చర్చ జరుగింది.