సార్వత్రిక ఎన్నికల కంటే ముందుగా ఓ ఉప ఎన్నికకు వెళ్లి, అక్కడ విజయం సాధిస్తే పార్టీకి ఊపు వస్తుందని తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ భావిస్తున్నారనీ, అందుకే నల్గొండ పార్లమెంటరీ స్థానానికి ఉప ఎన్నిక వస్తుందని అనుకున్నారు! అదే ఊపుతో ప్రతిపక్షాలు కూడా రెడీ అయిపోయాయి. ఒకవేళ ఎన్నికంటూ వస్తే.. తెలుగుదేశం తరఫున రేవంత్ రెడ్డి బరిలోకి దిగడానికి సిద్ధపడిపోయారు! నల్గొండ పరిధిలో తమకే పట్టు ఉందనీ, తెరాసను ఓడించేందుకు తామూ సిద్ధమంటూ కాంగ్రెస్ కూడా సిద్ధమైపోయింది. ఓ వారం రోజులపాటు ఇదే అంశంపై వాడీవేడిగా రాజకీయ వర్గాల్లో చర్చలు జరిగాయి. కానీ, ఇప్పుడా వేడి కాస్త తగ్గింది. ఇంతకీ.. నల్గొండ ఉప ఎన్నిక అవసరమా అంటూ తెరాసకి చెందిన కొంతమంది నేతలే అభిప్రాయపడుతున్నారట!
నిజానికి, పార్టీ మారిన తరువాత కూడా తెరాసలో ఎంపీగా కొనసాగుతున్నారు గుత్తా సుఖేందర్ రెడ్డి. ఆయనతో రాజీనామా చేయిస్తేనే ఉప ఎన్నిక సాధ్యం. అయితే, ఆయన ఎప్పుడు రాజీనామా చేస్తారనేది ఇంకా ఒక స్పష్టత రావడం లేదు! ఆయనకు ఇస్తామన్న రైతు సమన్వయ కమిటీ పదవీ ఇంకా ఇవ్వలేదు. ఆ పదవికి క్యాబినెట్ హోదా కూడా కల్పిస్తామని కూడా చెప్పారు కదా! ఒకవేళ ఇప్పటికే గుత్తాకి కొత్త పదవి ఇచ్చి ఉంటే.. రాజీనామాపై స్పష్టత వచ్చేసేది. గుత్తా పదవి మీదా, రాజీనామాకు సంబంధించి కూడా ప్రస్తుతం ముఖ్యమంత్రి ప్రస్థావించడం లేదని తెరాస వర్గాలే చెబుతున్నాయి. అయితే, మరో పదిరోజుల్లో స్పష్టత ఖాయం అంటున్నారు!
ఇంకోపక్క సింగరేణి గుర్తింపు కార్మిక సంఘాల ఎన్నికలు జరుగుతున్నాయి. వాటిని కూడా తెరాస ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకున్న సంగతి తెలిసిందే. ఆ ఎన్నికలు పూర్తయ్యాక, అక్కడి ఫలితాలను చూశాక నల్గొండపై నిర్ణయం తీసుకుంటే బాగుంటుందనే అభిప్రాయం కూడా కొంతమంది తెరాస నేతలు వ్యక్తం చేస్తున్నారట. ఎలాగూ గడువు కంటే ముందుగానే సార్వత్రిక ఎన్నికలు ఉంటాయంటూ కేంద్రం సంకేతాలిస్తోంది. ఇప్పటికిప్పుడు గుత్తాతో రాజీనామా చేయించినా.. వెంటనే నోటిఫికేషన్ విడుదల కాకపోతే పరిస్థితి ఏంటనే ప్రశ్న కూడా ముఖ్యమంత్రి వరకూ కొంతమంది నేతలు తీసుకెళ్లినట్టు సమాచారం. ఇక, ఈ అంశంపై ఎటూ స్పందించలేని పరిస్థితి గుత్తాది! రాజీనామా చేయాలో వద్దో కూడా ఆయనకే తెలియనట్టు తయారైంది. ఏదేమైనా, గుత్తాతో రాజీనామా చేయించాలనే అంశంపై చర్చోపచర్చలు జరిగే అవకాశం కనిపిస్తోంది. సింగరేణిలోనే తెరాస సర్వశక్తులూ ఒడ్డాల్సిన పరిస్థితి కనిపిస్తున్న నేపథ్యంలో పునరాలోచనకు ఆస్కారం ఉందనే పరిస్థితి తెరాసలో కనిపిస్తోంది!