తమిళనాడు ముఖ్యమంత్రి జయలలిత చెన్నై అపోలో ఆసుపత్రిలో చేరి 18 రోజులు దాటేసింది. ఇంతవరకూ ఆమెకి జరుగుతున్న చికిత్స ఏంటనేది ఎవ్వరికీ తెలీదు! హెల్త్ బులిటెన్లు విడుదల చేస్తున్నా వాటిలో పడికట్టు పదాలు తప్ప విషయం ఉండటం లేదు. అమ్మని పరామర్శించేందుకు పలువురు ప్రముఖులు వచ్చి వెళ్తున్నా… వారు కూడా విషయం చెప్పడం లేదు. ‘అమ్మ త్వరగా కోలుకుంటున్నామని ఆశిస్తున్నాం’ అనేస్తున్నారు. ముఖ్యమంత్రి ఆరోగ్య విషయమై సమాచార హక్కు చట్టాన్ని ఆశ్రయించినా ప్రయోజనం లేకపోయింది. మద్రాస్ హైకోర్టులో పిటీషన్ వేసినా కూడా ఉపయోగం లేకపోయింది. తమ ముఖ్యమంత్రి ఆరోగ్య సమస్య గురించి సమాచారం తెలుసుకోలేని పరిస్థితుల్లో ఉన్నారు. అమ్మ ఆరోగ్య విషయమై ప్రభుత్వం చాలా గోప్యత పాటిస్తోంది. బహుశా దేశంలో ఏ రాష్ట్రంలో ఇలాంటి పరిస్థితి ముందెన్నడూ రాలేదనే చెప్పాలి. ముఖ్యమంత్రికి ఏమైందనే విషయాన్ని ఇన్నాళ్లపాటు దాచి ఉంచాల్సిన అసవరం ఏమొచ్చింది అనేది మిలియన్ డాలర్ ప్రశ్నగా మారింది.
ఇలాంటి సందర్భంలో ప్రజలకు అందుబాటులో ఉన్నది సోషల్ మీడియా మాత్రమే. జయలలితకు సంబంధించిన రకరకాల పుకార్లు సోషల్ మీడియాలో షికార్లు చేస్తున్నాయి. ఆమె వెంటిలేటర్ మీద ఉన్నట్టు కొన్ని ఫొటోలు వైరల్ అవుతున్నాయి. జయలలిత ఆసుపత్రిలో తన గదిలో నడుస్తున్నారు అంటూ ఓ పది సెకెండ్ల వీడియో హల్ చల్ చేస్తోంది. ఇక, జయలలిత వారసుల గురించి సోషల్ మీడియాలోనే రకరకాల చర్చలు జరుగుతున్నాయి. తన వారసునిగా పార్టీపై సర్వహక్కులతోపాటు ముఖ్యమంత్రి పదవిని కూడా హీరో అజిత్‌కు జయ వీలునామా రాసేశారని సోషల్ మీడియాలో ఒకటే చర్చ. ముఖ్యమంత్రి పదవిని వీలునామా రాసి ఇవ్వడం సాధ్యమా అనేది వేరే చర్చ! ఇక, జయలలిత స్నేహితురాలు శశికళ ముఖ్యమంత్రి పీఠం కోసం ప్రయత్నిస్తున్నారంటూ కొన్ని పోస్టులు చక్కర్లు కొడుతున్నాయి.
దీంతో పోలీసులు అలెర్ట్ అయ్యారు. సోషల్ మీడియాలో పుకార్లు పుట్టిస్తున్నవారిపై కేసులు నమోదు చేయడం మొదలుపెట్టారు. ఈ తరుణంలో ఏఐడీఎంకే దిద్దుబాటు చర్యలకు తిగుతోంది. జయలలిత కోలుకుంటున్నారనీ, మన పోస్టులు మార్చుకుందాం, అమ్మ త్వరగా కోలుకోవాలని ప్రార్థిద్దాం అంటూ సోషల్ మీడియాను కంట్రోల్ చేసే ప్రయత్నాలు చేస్తోంది. ఈ ప్రచారానికి కొంత స్పందన కనిపిస్తోంది.
ఇంతకీ, సోషల్ మీడియాలో అమ్మ ఆరోగ్యం గురించి పోస్టులు ఆపడం సాధ్యమా..? అయినా, ఈ పోస్టులపై ఎన్నికేసులు పెడతారు..? ఎంతమందిని అరెస్టు చేయగలగుతారు..? మీ ప్రొఫైల్ స్టేటస్ మార్చుకోండి అని చెప్పినంత మాత్రాన సోషల్ మీడియాలో చర్చపై నియంత్రణ సాధ్యమా..? ప్రభుత్వం చేయాల్సింది ఇదికాదు! జయలలిత వాస్తవ ఆరోగ్య పరిస్థితి ఏంటనేది ఒక్క ప్రకటన చేస్తే ఇలాంటి ప్రచారాలు ఆగిపోతాయి. ప్రజలకు నిజం తెలియాలి. తమ ముఖ్యమంత్రికి ఏమైందో కూడా తెలుసుకోలేని పరిస్థితిలో తమిళ ప్రజలు ఉన్నారంటే… ప్రభుత్వం ఏం చేస్తున్నట్టు..? ప్రజలకు నిజం తెలియకుండా దాచే సర్కారు బహుశా ఏ రాష్ట్రంలో ఉండదేమో..?