తెలంగాణలో బీజేపీకి మంచి అవకాశాలున్నాయి అన్నది అందరూ అనేదే. మొన్నటి ఎన్నికల్లో 8 ఎంపీలు గెలిచాక, ఆ పార్టీ ఫుల్ ఫోకస్ చేస్తుందనుకున్నారు అంతా. కానీ, ఎంత మంచి అవకాశాలు వచ్చినా బీజేపీ రాష్ట్ర నాయకత్వం చేస్తున్న ఆలస్యం ఆ పార్టీ క్యాడర్ నే అసంతృప్తి పడేలా చేస్తున్నాయి.
తాజాగా బీఆర్ఎస్ ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి చేసిన తెలంగాణ, ఆంధ్రా వ్యాఖ్యలు ఇప్పుడు పెద్ద దుమారానికే దారి తీస్తున్నాయి. కాస్త ఆలస్యంగా అయినా కాంగ్రెస్ రియాక్ట్ అయినా, బీజేపీ అసలు మౌనంగా ఉండటం చర్చనీయాంశంగా మారింది.
అధికారంలో ఉన్నా గ్రేటర్ హైదరాబాద్ లో కాంగ్రెస్ పార్టీకి పట్టు లేదు అన్నది ఓపెన్ సీక్రెట్. కానీ, బీజేపీకి అలా కాదు. నగరం అంతా కార్పోరేటర్లు ఉన్నారు. బీఆర్ఎస్ కు చమటలు పట్టించేలా గత గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికల్లో బీజేపీ ఫలితాలు రాబట్టింది. పైగా మరో ఏడాదిన్నరలో మళ్లీ గ్రేటర్ ఎన్నికలున్నాయి. ఇలాంటి సమయంలో బీఆర్ఎస్ ఇచ్చిన పదునైన అస్త్రాన్ని బీజేపీ వదులు కోవటం చర్చనీయాంశంగా మారింది.
బీఆర్ఎస్ ను దెబ్బతీస్తూ గ్రేటర్ లో బీజేపీ ఎదిగేందుకు ఇదో మంచి అవకాశం. కేసీఆర్ ప్రశ్నిస్తూ… కాంగ్రెస్ సైలెన్స్ ను ప్రశ్నిస్తూ… బీజేపీ పొలిటికల్ స్టాండ్ తీసుకుంటే పరిస్థితి వేరుగా ఉండేది. చిన్న చిన్న అంశాలకే స్పందించే బండి సంజయ్ కూడా ఈ ఇష్యూలోకి రాలేదు. దీంతో కారణం ఏమై ఉంటుందా అని కమళదళం సైతం ఆశ్చర్యపడుతోంది. బీజేపీ-బీఆర్ఎస్ మధ్య అవగాహన మొదలైందా…? రాష్ట్ర నాయకత్వంను కాదని బండి సంజయ్ ఎంటర్ కాలేకపోయారా…? సెటిలర్ల ఓట్లతో గెలిచి, బీజేపీ రాష్ట్ర అధ్యక్ష రేసులో ఉన్న ఈటల మౌనం దేనికి సంకేతం…? అన్న చర్చ జోరుగా సాగుతోంది.