పవన్ కల్యాణ్ ఎన్నికల ప్రచార వాహనం వారాహి హాట్ టాపిక్ అయింది. యుద్ధ ట్యాంక్‌ను పోలి ఉండటం.. సేనాని ఎన్నికల యుద్ధానికి వెళ్తున్నట్లుగా ఉండటంతో ఈ వాహనం పై చర్చోపచర్చలు జరుగుతున్నాయి. అయితే కొంత మంది ఈ వాహనం రంగుపై కొత్త వాదన తీసుకు వచ్చారు. ఇండియన్ మోటార్ వెహికల్ యాక్ట్‌లో కలర్స్ నిబంధనల్లో.. అలీవ్ గ్రీన్ రంగు.. మిలటరీ వాహనాలకు తప్ప.. మరి ఏ ఇతర వాహనాలకూ ఉండకూడదన్న నిబంధన ఉందని .. చెబుతున్నారు.
నిజంగానే మిలటరీ రంగు ఉన్న వాహనాలకు రిజిస్ట్రేషన్ చేయరు. అలా తిప్పడాన్ని అంగీకరించరు. ఖచ్చితంగా కలర్ మార్చాల్సిందే. అందుకే ఇప్పటి వరకూ మోటార్ కంపెనీలు ఏవీ అలీవ్ గ్రీన్ కలర్ వాహనాలను అమ్మలేదు. మిలటరీ వాహనాలకు మాత్రమే ఆ కలర్ ఉంటుంది. అయితే పవన్ కల్యాణ్ వాహనానికి అలీవ్ గ్రీన్ రంగు వేశారు. ఈ కారణంగా రంగు మార్చాల్సిందేనన్న వాదన వినిపిస్తోంది. పవన్ కల్యాణ్ వాహనానికి రిజిస్ట్రేషన్ అయిందో లేదో స్పష్టత లేదు. విడుదల చేసిన ఫోటోల్లో నెంబర్ ప్లేట్ లేదు.
తెలంగాణలో రిజిస్ట్రేషన్ చేసినా ఆ వాహనం తిరగాల్సింది ఏపీలో. అక్కడి అధికారులు పవన్ కల్యాణ్ అంటే.. ప్రత్యేక దృష్టిలో నిబంధనలను చూస్తారు. ఎంత ఇబ్బంది పెట్టాలో అంత ఇబ్బంది పెడతారు.. అందులో సందేహం లేదు. అలీవ్ గ్రీన్ కలర్‌తోనే ఏపీలోకి వెళ్తే.. అడ్డుకోవడం ఖాయం. ఇదే విషయాన్ని ముందుగానే మాజీ రవాణా మంత్రి పేర్ని నాని ప్రకటించారు. అలాంటి వాహనాలకు పర్మిషన్ ఉండదని.. రంగు మార్చుకోవాల్సిందేనన్నారు. మరి పవన్ ఏం చేస్తారో చూడాల్సి ఉంది.