ఓడిపోతానన్న భయం… కలిసి రాని కుటుంబం… వెంటాడుతున్న బాబాయ్ కేసు…మరోవైపు దూకుడు మీదున్న కూటమి!
వీటన్నింటికి తోడు ఏపీ కాంగ్రెస్ చీఫ్ గా షర్మిల తీవ్ర విమర్శలు చేస్తున్నారు. షర్మిల వెంటే తన ప్రయాణం అంటూ వైఎస్ విజయమ్మ కూడా షర్మిలకు అండగా ఉంటూ వచ్చారు. తెలంగాణ ఎన్నికల సమయంలో షర్మిల రాజకీయ ప్రస్థానంలో విజయమ్మ కూడా ఉన్నారు. ఇటీవల షర్మిల కొడుకు పెళ్లిలోనూ విజయమ్మ ఉన్నప్పటికీ జగన్ కుటుంబం మాత్రం ఎక్కడా కనపడలేదు. దీంతో ఏపీ ఎన్నికల్లోనూ విజయమ్మ షర్మిలతోనే నడుస్తారు అని అంతా అనుకున్నారు.
కానీ, ఏపీలో విజయమ్మ షర్మిల వెంట నడుస్తే అసలుకే మోసం వస్తుందని… వివేకా హత్య కేసు ఇప్పటికే ఇబ్బందిగా ఉన్న టైంలో ఇప్పుడు విజయమ్మ కూడా లేకపోతే ఇబ్బంది అవుతుందనుకొని జగన్ విజయమ్మ శరణు కోరారా అన్న అనుమానాలు పొలిటికల్ సర్కిల్స్ లో వినపడుతున్నాయి.
నిజానికి వైసీపీకి గౌరవ అధ్యక్షురాలిగా ఉన్న విజయమ్మను తొలిగించి, తనకూ పార్టీకి సంబంధం లేదు అన్నట్లుగా చేశారు పార్టీ పెద్దలు. జగన్ కే అన్ని బాధ్యతలు కట్టబెట్టారు. ఆ తర్వాత విజయమ్మ కూడా జగన్ తో అంటీముట్టనట్లుగానే ఉన్నారు.
ఇప్పుడు సడన్ గా ఏపీ ఎన్నికల ప్రచారానికి ముహుర్త సమయంలో… ఇడుపులపాయలోని వైఎస్సార్ ఘాట్ వద్ద విజయమ్మ కనపడటం, ఇద్దరూ అప్యాయంగా పలకరించుకోవటం, జగన్ అనుకూల మీడియాతో పాటు సోషల్ మీడియాలో ఎక్కువగా ప్రచారం చేసుకోవటం చూస్తుంటే కావాలనే స్టేజ్ మ్యానేజ్ చేశారా అన్న చర్చ జోరందుకుంది.