కృష్ణా జిల్లాలో జరిగిన ఘోర బస్సు ప్రమాదంలో పదకొండు మంది మరణించిన సంగతి తెలిసిందే. అయితే, ఈ ప్రమాదానికి పూర్తి రాజకీయ రంగు పూసేసింది అధికార పార్టీ! ప్రమాద ఘటనపై కాకుండా… ప్రతిపక్ష నేత తీరుపై ఎక్కువ శ్రద్ధ పెడుతోంది. ఓ రకంగా ఈ ప్రమాదాన్ని అడ్డుకుపెట్టుకుని ప్రతిపక్షంపై కక్షసాధింపులకు దిగుతోందన్న అభిప్రాయమూ వ్యక్తమౌతోంది. తెలుగుదేశం నేత జేసీ దివాకర్ రెడ్డికి చెందిన ట్రావెల్స్‌ను రక్షించే పని చంద్రబాబు సర్కారు తీసుకున్నట్టుగా పరిస్థితి కనిపిస్తోంది.
ఇంత ఘోర ప్రమాదం జరిగిన తరువాత దీనికి గల కారణాలపై ఇతమిత్ధమైన చర్చ జరగాలి. కానీ, ప్రభుత్వ తీరు మరోలా ఉంటోంది. ఈ ప్రమాద విషయమై క్యాబినెట్ సమావేశంలో తెలుగుదేశం నేతలు చర్చించిన తీరు తెలిస్తే… తెర వెనక ఏం జరుగుతోందో అర్థమౌతుంది! బస్సు ప్రమాదానికి సంబంధించిన కొన్ని వీడియోలను క్యాబినెట్ సమావేశంలో ప్లే చేసి చూసుకున్నారట. అయితే, ఈ వీడియోలు ప్లే చేసుకున్నది… ప్రమాద తీరును గమనించేందుకు కాదని సమాచారం! వారు చూసింది ఏంటంటే.. విపక్ష నేత జగన్ వచ్చిన తీరు, బాధితులను పరామర్శించిన తీరు, అధికారులతో డాక్టర్లతో వాగ్వాదానికి దిగిన తీరు, కలెక్టర్‌తో మాట్లాడిన తీరు! క్యాబినెట్లో వీటి గురించే ఎక్కువసేపు మాట్లాడుకున్నట్టు సమాచారం! ఈ వీడియోస్ చూస్తూ… మంత్రులందరూ విపక్ష నేత జగన్‌పై విమర్శలు చేశారట!
ఆయన తీరు దారుణంగా ఉందంటూ తప్పుబట్టారట! ఒక ప్రమాదం జరిగినప్పుడు అధికార పార్టీ చర్చించాల్సిన అంశం ఇదా…? విపక్ష నేత జగన్ అధికారులతో వ్యవహరించిన తీరు ఎలా ఉన్నా… క్యాబినెట్లో ఈ అంశాన్ని చర్చించాల్సినంత అవసరం ఉందా..? ప్రమాదానికి కారణమైన ట్రావెల్స్ కంపెనీపై చర్చ ఏది..? రాష్ట్రంలో కుప్పలు తెప్పలుగా ఉన్న ప్రైవేట్ ట్రావెల్స్ భద్రతపై విశ్లేషణ ఏదీ..? ప్రయాణికుల భద్రత కోసం భవిష్యత్తు తీసుకుంటున్న కఠిన చర్యలపై సూచనలేవీ..?
ఇవన్నీ వదిలేసి… కేవలం జగన్ వీడియోలను మాత్రమే చూస్తే ఏమనుకోవాలి..? క్యాబినెట్ అంతా కలసి ఎవరి ప్రయోజనాలను రక్షించడం కోసం ప్రయత్నిస్తోందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. జేసీ దివాకర్ రెడ్డి ఇప్పటికీ కాంగ్రెస్ పార్టీలోనే ఉండి ఉంటే పరిస్థితి ఇలా ఉండేదా..? ప్రతిపక్ష పార్టీ నేతపై విమర్శలు చేయడానికి ఎలాగూ మీడియా సమావేశాలు ఉన్నాయిగా! కనీసం క్యాబినెట్లో అయినా ప్రజలకు పనికొచ్చే అంశాలు చర్చించాలిగానీ.. ఇలా రాజకీయ వ్యూహాలకు పదును పెట్టడమేంటీ..? అదేమైనా పార్టీ సమావేశమా..?