ప్రధానమంత్రి నరేంద్ర మోడీని కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీ హగ్ చేసుకున్న సంగతి తెలిసిందే. పార్లమెంటులో చోటు చేసుకున్న ఈ పరిణామం దేశవ్యాప్తంగా తీవ్ర చర్చనీయాంశమైంది. ఈ ఘటనపై చాలా విశ్లేషణలు వచ్చాయి. అయితే, తాజా సమాచారమేంటంటే… మోడీని కౌగిలించుకోవాలనేది అప్పటికిప్పుడు తీసుకున్న నిర్ణయం కాదనీ, కొన్ని నెలలుగా రాహుల్ గాంధీ ఈ అవకాశం కోసం ఎదురుచూస్తున్నారంటూ కథనాలు మీడియాలో కనిపిస్తున్నాయి. కొన్నాళ్ల కిందట రాహుల్ కుటుంబ సభ్యులను ప్రధాని తీవ్రంగా విమర్శించారు. అప్పుడే రాహుల్ ఈ నిర్ణయానికి వచ్చారట. మోడీ చేస్తున్న విమర్శలకు బహిరంగంగా తిప్పికొట్టాలంటే.. ప్రేమతో ఆయనకో హగ్ ఇవ్వాలని ఎదురుచూస్తూ వచ్చారట.
టీడీపీ అవిశ్వాస తీర్మానం పెట్టడంతో గత శుక్రవారం నాడు రాహుల్ ఈ సందర్భంలో హగ్ ఇచ్చారు. దేశవ్యాప్తంగా అందరూ పార్లమెంటువైపు చూస్తున్న తరుణం కాబట్టి.. వెంటనే హగ్ ఇచ్చేశారని అంటున్నారు. అవిశ్వాస తీర్మాన చర్చలో ఇదే హైలైట్ అయింది. సోషల్ మీడియాలో ప్రముఖంగా చర్చ జరిగింది. ఇక, జాతీయ మీడియాలో అయితే గంటల కొద్దీ చర్చలు.. ఇంకా విశ్లేషణలు కొనసాగుతూనే ఉన్నాయి. ఇంతకీ.. ఇదేమైనా జరగకూడని ఘటనా, పార్లమెంటులో ఇలా చెయ్యకూడదా అంటే.. అలాంటిదేమీ లేదు. ఓరకంగా చర్చల సందర్భంగా వేడెక్కిన వాతావరణాన్ని కూల్ చేసేందుకు ఇలాంటి ఘటనలు కొంత ఉపయోగపడొచ్చు.
అయితే, ఈ ఘటనను భాజపా తీవ్రంగా ఖండించాల్సిన అవసరమూ లేదు. తమ అధినేత ఏదో ఘనకార్యం చేశాడంటూ ప్రేమను ప్రదర్శించాడంటూ కాంగ్రెస్ నేతలు గొప్పలు చెప్పుకుంటున్నంత చారిత్రక ఘటనా కానేకాదు. పార్లమెంటులో ఇలాంటి ఘటనల వల్ల ప్రజా సమస్యలపై చిత్తశుద్ధి లేమిని రాజకీయ పార్టీలు ప్రదర్శించినట్టని కొంతమంది విమర్శించేస్తున్నారు. వాస్తవానికి సభలో ఇంతకంటే తీవ్రంగా సభ్యులు వ్యవహరిస్తూ.. చర్చను పక్కతోవ పట్టిస్తున్న సందర్భాలు కోకొల్లలు. గత పార్లమెంటు సమావేశాలే అందుకు ఉదాహరణ.
కాబట్టి, ఈ ఘటనకు ఇంత ప్రాధాన్యత అవసరం లేదు. దాదాపు వారం రోజులౌతున్నా కూడా ఇంకా… రాహుల్ హగ్ వెనక రహస్యాలు అంటూ ఉద్దేశాలూ నేపథ్యాలు వెలికి తీసి చర్చించడం వల్ల ప్రజలకు ఎలాంటి ఉపయోగమూ లేదు. కాసేపు టైం పాస్ అంతే.