తెలంగాణలో లోక్ సభ ఎన్నికలకు అంతా సిద్ధమైంది. పోలింగ్ కేంద్రాల వద్ద ఏర్పాట్ల హడావుడీ మొదలైపోయింది. అయితే, చివరి రోజు ప్రచారంలో కూడా తెలంగాణకు చెందిన ప్రధాన పార్టీలు పెద్దగా హడావుడి చెయ్యలేదు. నిన్న సాయంత్రం వరకూ ప్రచారానికి ఉన్న సమాయాన్ని ముందుగానే ముగించేసుకున్నాయి ప్రధాన పార్టీలు. డిసెంబర్ లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో చివరి నిమిషం వరకూ ప్రచార సమయాన్ని వినియోగించుకున్న ప్రధాన పార్టీలు… లోక్ సభ ఎన్నికలకు వచ్చేసరికి అంత తీవ్రంగా ప్రచారం చెయ్యలేదనే చెప్పాలి.
తెలంగాణలో లోక్ సభ ఎన్నికల్లో ఎవరు గెలుస్తారు, ఎవరు ఓడిపోతారు అనే చర్చ కంటే… ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలు ఏమౌతాయన్న చర్చే రాష్ట్రవ్యాప్తంగా ప్రధానంగా మారింది. ఆంధ్రా అసెంబ్లీ ఎన్నికలవైపు తెలంగాణ ఆసక్తిగా చూస్తోంది. అధికార, ప్రతిపక్షాల మధ్య నెలకొన్న తీవ్ర పోటీ ఎలా ఉంటుందా అనే అంశమే ఇక్కడ చర్చనీయంగా ఉంది. ఏపీ ఎన్నికల మీదే ఇక్కడ బెట్టింగులు ప్రారంభమైనట్టు కూడా కథనాలు వస్తున్నాయి.
ఇంకోపక్క, హైదరాబాద్ నుంచి ఆంధ్రాకు వెళ్లి ఓటు హక్కు వినియోగించుకునేవారి హడావుడి కనిపిస్తోంది. నిన్నరాత్రే చాలామంది రైళ్లూ బస్సుల్లో ప్రయాణమయ్యారు. ఇవాళ్ల ఉదయం కూడా చాలామంది ఆంధ్రాకి బయల్దేరి వెళ్తున్నారు. బుధవారం ఉదయమే చౌటుప్పల్ దగ్గరున్న పంతంగి టోల్ ప్లాజా వద్ద దాదాపు కిలో మీటర్ పొడవున ట్రాఫిక్ జామ్ అయింది. సంక్రాంతి పండుగ సమయంలో మాత్రమే ఇంత పెద్ద సంఖ్యలో వాహనాలు బయల్దేరతాయి. కానీ, ఈసారి సొంత ఊళ్లో ఉన్న ఓటుహక్కు వినియోగించుకునేందుకు పెద్ద ఎత్తున బయల్దేరారు. పైగా, హైదరాబాద్ లోని కొన్ని పాఠశాలలు కూడా 10వ తేదీ నుంచే వేసవి సెలవులు ఇచ్చేశాయి. దీంతో, ఓటెయ్యడానికి బయల్దేరిన వారి సంఖ్య గణనీయంగా ఎక్కువే ఉంది. ఓటు హక్కు వినియోగం కోసం ఇన్ని వ్యయప్రయాసలకు ఓర్చి బయల్దేరి వెళ్లడం మంచి పరిణామమే. ఓవరాల్ గా, తెలంగాణలో ఏపీ ఎన్నికల హడావుడే ఎక్కువగా కనిపిస్తోంది.