జాన్వీకపూర్ తెలుగు ఎంట్రీ ఎప్పుడెప్పుడా అని ఎదురు చూసిన అభిమానుల కోరిక తీర్చింది `దేవర`. ఈ సినిమాలో జాన్వీ స్క్రీన్ ప్రజెన్స్ ఓకే అనిపించుకొంది. ‘చుట్టమల్లె’ పాటలో అయితే డాన్సుల్లోనూ ఆకట్టుకొంది. అయితే ఈ పాత్ర నిడివి మాత్రం చాలా చిన్నది. ఫస్టాఫ్‌లో అసలు కనిపించలేదు. సెకండాఫ్‌లోనూ తను ఉన్నది నాలుగైదు సీన్లలోనే. రెండు పాటల్లో నర్తించినా.. ఒక పాట పూర్తిగా పక్కన పెట్టేశారు. ఈ నాలుగు సీన్లూ, ఒక పాటకూ తాను అందుకొన్న పారితోషికం అక్షరాలా రూ.4 కోట్లు. పార్ట్ 2 షూటింగ్ ఇంకా మొదలెట్టలేదు. కాబట్టి ఈ రెమ్యునరేషన్ పార్ట్ 1కి మాత్రమే. అరంగేట్రంలోనే రూ.4 కోట్లు అందుకొన్న హీరోయిన్గా జాన్వీ రికార్డ్ బ్రేక్ చేసిందనే అనుకోవాలి.
జాన్వీ స్క్రీన్ టైమ్ మరీ ఇంత తక్కువ ఉందేంటి? అని పెదవి విరిచినవాళ్లు ఉన్నారు. కాకపోతే.. ఆ పాత్రకు కథలో అంత స్పేస్ లేదు. పార్ట్ 2 అంటూ కథని విడగొట్టారు కాబట్టి, జాన్వీ పాత్రని పార్ట్ 2లో ఎక్కువ వాడుకొన్నారేమో అనిపిస్తోంది. చిత్రబృందం కూడా అదే చెబుతోంది. ‘పార్ట్ 2’లో జాన్వీ ప్రధాన భూమిక పోషించనున్నదని ఎన్టీఆర్, కొరటాల ఓ ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చారు. ఏది ఏమైనా జాన్వీ స్క్రీన్ టైమ్ విషయంలో ఓ అసంతృప్తి మాత్రం ఉంది. ఆ పాత్రని ఇంకాస్త బాగా తీర్చిదిద్దాల్సింది అనే కామెంట్లు వినిపించాయి. ఓ పాటని డిలీట్ చేయకపోతే… జాన్వీ స్క్రీన్ టైమ్ గురించి ఇంత డిస్కర్షన్ జరిగేది కాదు.