కాకినాడలో సమర శంఖారావ సభను నిర్వహించారు వైకాపా అధినేత జగన్మోహన్ రెడ్డి. ఎన్నికల షెడ్యూల్ వచ్చిన తరువాత జరిగిన సభ కాబట్టి, జగన్ ఏదైనా ప్రత్యేకత ఉంటుందేమో అనే ఆసక్తి ఉంది. కానీ, దాదాపు గంటన్నర మాట్లాడిన జగన్.. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పేరును కనీసం నిమిషానికి సగటున మూడుసార్లు ప్రస్థావిస్తూనే మాట్లాడారు. ప్రజల్లో చర్చ జరగాల్సిన సమయం వచ్చిందనీ, ప్రతీ పట్టణంలో, గ్రామంలో, ప్రతీ ఇంట్లో చంద్రబాబు పాలనపై చర్చ జరగాలన్నారు. ప్రపంచంలోనే నంబర్ వన్ అవినీతిపరుడు చంద్రబాబు అన్నారు. చంద్రబాబు ఇస్తున్న పథకాలను నమ్మొద్దని ప్రజలకు చెప్పాలని కార్యకర్తలకు చెప్పారు. జగన్ కి భయపడే వృద్ధాప్య పెన్షన్లను రూ. 2 వేలు చేశారనీ, పసుపు కుంకుమ పేరుతో ఆడపడుచులను మోసం చేస్తున్నారని వివరించాలన్నారు.
‘అన్న జగన్ ముఖ్యమంత్రి’ కాగానే పెన్షన్ ను రూ. 3 వేలకు పెంచుకుంటూ పోతాడనీ, పిల్లల్ని బడికి పంపిస్తే చాలు, ప్రతీయేటా అన్న రూ. 15 వేలు ఇస్తాడని అందరికీ చెప్పాలన్నారు జగన్. ప్రత్యేక హోదాను చంద్రబాబు ఢిల్లీకి తాకట్టుపెట్టారన్నారు. మట్టి, ఇసుక, మద్యం, బొగ్గు, గుడి భూములు.. ఇలా ఎక్కడ చూసినా చంద్రబాబు హయాంలో అవినీతి జరుగుతోందన్నారు. రాజధాని పేరుతో అడ్డగోలుగా 50 వేల ఎకరాలు సేకరించారనీ, ఇప్పుడు అక్కడ గడ్డి, పిచ్చిమొక్కలు మాత్రమే కనిపిస్తున్నాయన్నారు. తాత్కాలిక అసెంబ్లీ, తాత్కాలిక సచివాలయం గోడలకు బీటలుపడ్డాయనీ.. పోలవరం ప్రాజెక్టు గోడలకు కూడా బీటలున్నాయన్నారు. ఇలా చెప్పుకుంటే పోతే గడచిన ఐదేళ్లలో ఆంధ్రాలో పరిపాలనే జరగనట్టు, అంతా అవినీతిమయం అన్నట్టుగా జగన్ సుదీర్ఘంగా ప్రసంగించారు.
ముఖ్యమంత్రి తీరుపై చర్చ జరగేలా చూడ్డమే ప్రచారమని జగన్ అనుకుంటున్నారు! మరి, జగన్ తీరు మీద కూడా చర్చ జరగాలి కదా. ప్రతిపక్ష నేతగా ఆయన ప్రజల తరఫున నిలబడ్డ తీరు మీద చర్చ జరగొద్దా..? తన రాజకీయ లక్ష్యం కోసం అసెంబ్లీకి డుమ్మా కొట్టిన తీరుపై చర్చ జరగొద్దా..? ఉప ఎన్నికలకు ఆస్కారం లేకుండా కంఫర్టుగా ఎంపీలతో రాజీనామాలు చేయించి, దాన్నే హోదా సాధన పోరాటమన్న తీరు మీద చర్చ జరగొద్దా..? ఏపీ ప్రయోజనాల కోసం పార్లమెంటులో అవిశ్వాస తీర్మానం ప్రవేశపెడితే, ఇతర పార్టీలను కూడగట్టకుండా తప్పుకున్న వైకాపా తీరు మీద చర్చ జరగొద్దా..? హోదా, రైల్వే జోన్, కడప ప్లాంట్, విభజన చట్టం అమలుపై కేంద్రంపై ఏనాడైనా ధీటుగా పోరాడలేని అలసత్వంపై చర్చ జరగొద్దా..?
ఆంధ్రుల ఆత్మగౌరవాన్ని దెబ్బతీసే విధంగా మాట్లాడుతున్న తెలంగాణ ముఖ్యమంత్రితో అంటకాగుతున్న తీరుపై చర్చ జరగొద్దా..? కోడి కత్తి కేసుపై చర్చ జరగొద్దా..? తాజాగా ఫామ్ 7లు తానే ఇచ్చానని ఒప్పుకుని, ఎన్నికల సంఘాన్ని తప్పుదోవ పట్టించడంపై చర్చ జరగొద్దా..? అన్నిటికీమించి… ప్రతీవారం కోర్టుకు వెళ్లే నాయకుడు ముఖ్యమంత్రిగా మనకు సరిపోతాడా లేదా అనే చర్చ ప్రజల్లో జరగొద్దా..? ముఖ్యమంత్రిపై చర్చ జరగాలని అంటున్నప్పుడు, ముఖ్యమంత్రి కావడమే లక్ష్యంగా పెట్టుకున్న జగన్ మీద కూడా చర్చ ప్రజల్లో జరుగుతుంది కదా.