ఏపీ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా భావిస్తున్న దిశ చట్టాన్ని కేంద్రం వెనక్కి పంపింది. తెలంగాణలో దిశ ఘటన జరిగిన తర్వాత ఏపీలో హుటాహుటిన బిల్లు ఆమోదించేసి.. ఢిల్లీకి పంపిన ఏపీ సర్కార్.. ఆ బిల్లును కేంద్రం ఆమోదించడం కోసం ఎదురు చూస్తోంది. కేంద్రం ఆ చట్టాన్ని.. వివిధ మంత్రిత్వ శాఖలకు పంపింది. కేంద్ర, న్యాయ, శాసన వ్యవహారాలు, మహిళా శిశు సంక్షేమశాఖ, హోంశాఖ పరిధిలోని మహిళా విభాగాలకు బిల్లు వెళ్లింది. అన్ని శాఖలు.. ఆ బిల్లులో చాలా లోపాలున్నాయని… చూపిస్తూ వెనక్కి పంపాయి. అనేక సవరణలతో తిరిగిఏపీకి పంపారు.
తెలంగాణలో దిశ ఉదంతం జరిగిన వెంటనే.. తెలంగాణ సీఎం కంటే.. ఎక్కువగా ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డి ఆవేశ పడ్డారు. అసెంబ్లీ సమావేశాలు జరుగతూండగానే… దిశ చట్టం తీసుకు వచ్చారు. దీని ప్రకారం.. అత్యాచారం చేస్తే 21 రోజుల్లో ఉరి శిక్ష విధిస్తారు. దీనిపై.. న్యాయనిపుణులు ఎన్నో సందేహాలు లెవనెత్తారు. కానీ అందరిపైనా.. రాజకీయ విమర్శలతో విరుచుకుపడిన.. వైసీపీ సర్కార్.. తాను అనుకున్నట్లుగా బిల్లు చేసింది. ప్రభుత్వ పెద్దల ఫోటోలను..పార్టీ కార్యకర్తలతో పాలాభిషేకాలు చేయించుకున్నారు. దిశ చట్టం అమలులో ఉందన్న అభిప్రాయాన్ని కల్పిస్తున్నారు. కానీ రోజు రోజుకు జరుగుతున్న అత్యాచారాల విషయంలో మాత్రం దిశ చట్టాన్ని అమలు చేయడం లేదు.
దిశ చట్టానికి రాష్ట్రపతి ఆమోద ముద్ర పడలేదని తెలిసి కూడా.. ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి దిశ చట్టం అమలుపై.. అప్పుడప్పుడు సమీక్షలు చేస్తూండటం.. ఇందులో కొసమెరుపు. ఒక్కో పోలీస్ స్టేషన్ కు రూ. రెండు కోట్లు అంటూ.. ప్రత్యేక పోలీసు అధికారుల నియామం అంటూ.. భారీగా ప్రకటనలు చేస్తంటారు. కానీ.. ఎక్కడా ఒక్క కేసు కూడా నమోదు కావడం లేదు. ఇప్పుడు ఈ బిల్లు చట్ట విరుద్ధంగా ఉందన్న అభిప్రాయం.. కేంద్ర ప్రభుత్వం వ్యక్తం చేసి.. బిల్లు ఏపీకి తిరిగి పంపేసింది. ఇప్పుడు కేంద్రం పంపిన సవరణుల అన్నీ చేసి పంపితే.. నిర్భయ చట్టం కన్నా బలహీనమైన చట్టమే అవుతుంది. మహిళలపై దాడుల నిరోధానికి కఠిన చట్టాలున్నాయి. వాటిని అమలు చేస్తే పోయేదానికి కొత్త చట్టాల పేరుతో రాజకీయ స్టంట్లు చేయడం ఏమిటని న్యాయనిపుణులు మొదటి నుంచి విస్మయం వ్యక్తం చేస్తున్నారు.