దిశ చట్టాన్ని కేంద్రంతో ఆమోదింప చేసుకోవడం అనే మిషన్‌ను ఎంపీలకు సీఎం జగన్ ఇచ్చారు. వారు పార్లమెంట్ సమావేశాలకు వెళ్లే ముందు జగన్‌తో జరిగిన భేటీలో ఇదే అంశాన్ని ప్రధానంగా ప్రస్తానించి.. చట్టానికి ఆమోదముద్ర వేసుకుని రావాలని చెప్పి పంపించారు. జగన్ అడిగారు కాబట్టి.. ఎలాగైనా … చేసి చూపించాలనుకున్నారేమోకానీ.. మాజీ పోలీసు అధికారి.. ప్రస్తుత ఎంపీ అయిన గోరంట్ల మాధవ్… లోక్‌సభలోనే కేంద్రాన్ని ప్రశ్నించారు. ఆయితే ఆయన లిఖిత పూర్వక ప్రశ్న అడిగారు. దానికి కేంద్ర ప్రభుత్వం.. కేంద్ర హోంశాఖ సహాయమంత్రి కూడా లిఖిత పూర్వకంగా సమాధానం పంపారు.
దాని ప్రకారం.. దిశ చట్టంపై కేంద్రానికి వచ్చిన అభ్యంతరాలు.. అనుమానాలను నివృతి చేయమని ఏపీ సర్కార్‌కు తిరిగి పంపామని.. కానీ ఆ బిల్లు ఇంకా తమకు తిరిగి రాలేదని సమాధానంలో ఉంది. దీంతో వైసీపీ ఎంపీ మాధవ్‌కు మైండ్ బ్లాంక్ అయినంత పనైంది. అనవసరంగా తమ ప్రభుత్వ తప్పిదాన్ని తాను పార్లమెంట్ వేదికగా బయట పెట్టానని ఆయన బాధఫడ్డారేమో కానీ… అసలు విషయం మాత్రం బయట ప్రపంచానికి తెలిసిపోయింది. దిశ గురించి సీఎం జగన్ తరచూ సమావేశాలు ఏర్పాటు చేస్తూంటారు. ఇటీవల దిశ అవగాహన కోసం పెద్ద ఎత్తున ప్రకటనలు ఇచ్చారు.
దిశ యాప్ డౌన్ లోడ్ చేసుకోవాలని పోలీసుల్ని ఇంటింటికి పంపి.. మహిళలను చైతన్యవంతులను చేస్తున్నారు. అయితే ఇంత జరిగినా… ఇంత వరకూ దిశ చట్టం అమల్లోకి రాలేదు. ప్రభుత్వం ఈ విషయాన్ని బహిరంగంగా చెప్పడం లేదు. నేడో రేపో ఆమోదం వస్తుందన్నట్లుగా ప్రచారం చేస్తున్నారు. కానీ ఆ చట్టం ఆమోదించడానికి కేంద్రం వద్ద లేదని… ఇంకా ఏపీలోనే ఉందని.. వైసీపీ ఎంపీ మాధవ్.. తన ప్రశ్న ద్వారా ప్రజలకు క్లారిటీ ఇప్పించారు. దీంతో అసలు గుట్టు రట్టయింది.