ప్రముఖ దర్శకుడు ఎస్.ఎస్.రాజమౌళికి ప్రతిష్టాత్మక ఏఎన్నార్ అవార్డు ప్రకటించారు. నాగార్జున ఈ విషయాన్ని మీడియా సముఖంగా డిక్లేర్ చేశారు. ఈనెల 17న ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు చేతుల మీదుగా రాజమౌళి ఈ పురస్కారాన్ని అందుకొంటారు. రాజమౌళి సమర్థుడైన దర్శకుడే. ప్రస్తుతం ఇండియాలోనే మోస్ట్ వాంటెడ్ లిస్టులో…. తొలి స్థానాల్లోనే కనిపిస్తాడు. తెలుగు సినిమా ఖ్యాతిని ప్రపంచానికి చాటి చెప్పాడు. భారతీయ సినిమా ప్రతిష్ట పెంచాడు. బాహుబలి సినిమాతో గర్వపడే లా చేశాడు. ఏఎన్నార్ పురస్కారానికి అక్షరాలా అర్హుడు. కాకపోతే… రాజమౌళి కంటే సీనియర్లు చాలామందే ఉన్నారు. కె.రాఘవేంద్రరావు, విశ్వనాథ్ లాంటి వాళ్లని మర్చిపోయాడు నాగార్జున. దీంతో.. విమర్శకులకు అవకాశం ఇచ్చినట్టైంది. అక్కినేని సమకాలికులు కృష్ణ కూ ఇప్పటి వరకూ ఏఎన్నార్ అవార్డు ప్రకటించలేదు.
ముందు వీళ్లందరికీ ఇచ్చి, ఆ తరవాత రాజమౌళి వరకూ వచ్చుంటే బాగుండేది. అవార్డు ఫంక్షన్లు కూడా ఈమధ్య గ్లామర్‌ని కోరుకొంటున్నాయి. ఫామ్‌లో ఉన్నవాళ్లని పిలిచి పురస్కారాలు ఇస్తే మీడియా కవరేజీ బాగుంటుంది. ఆ అవార్డుకీ గ్లామర్ వస్తుందనుకొంటున్నారు. దాంతో రాజమౌళికి ఏఎన్నార్ అవార్డుకి ఎంపిక చేసుండొచ్చు. ప్రభుత్వం ప్రకటించే పద్మశ్రీలు, పద్మభూషణ్‌లూ సీనియార్టీనీ, సిన్సియార్టీనీ పట్టించుకోకుండా రికమెండేషన్లకూ, గ్లామర్లకూ తలొగ్గుతోంటే, వ్యక్తులు, ప్రైవేటు సంస్థలూ ప్రకటించే ఇలాంటి అవార్డులు గ్లామర్‌ని నమ్ముకోవడంలో తప్పులేదేమో..?!