తిరుమల తిరుపతి దేవస్థానంలో అధికారులు, పాలక మండలి మధ్య ఎప్పుడూ అండర్ స్టాండింగ్ ఉండదు. కానీ ఎపుడూ లోపల ఏం జరుగుతుందో బయటకు చెప్పుకోరు. కానీ ఇప్పుడు మాత్రం లోపల మీటింగ్ జరుగుతున్న సమయంలోనే బయట మీడియాకు సమాచారం ఇస్తున్నారు. ఈ వ్యవహారం దుమారం రేపుతోంది. గతంలో వైసీపీ హయాలో టీటీడీ చైర్మన్ గా ఎక్కువ కాలం పని చేసిన సుబ్బారెడ్డి, ఈవోగా పెత్తనం చేసిన ధర్మారెడ్డికి పడేది కాదు. కానీ ఇద్దరూ బయటపడలేదు. ఇప్పుడు అలా జరగడం లేదు.
టీటీడీ పాలక మండలి సభ్యులు రెండేళ్ల కాలపరిమితికే ఉంటారు. వారి పని నిర్ణయాలు తీసుకోవడం మాత్రమే. అమలు చేయాల్సింది మాత్రం అధికారులు. టీటీడీ చైర్మన్ కానీ.. బోర్డు సభ్యులు కానీ ఎప్పుడూ తిరుమలలో ఉండాల్సిన అవసరం లేదు. కానీ ఈవో ఇతర అధికారులు మాత్రం రోజువారీ పనులు చేయాలి. తమ మాట నెగ్గాలని టీటీడీ చైర్మన్, సభ్యులు అనుకుంటారు. కానీ వారు చెప్పేవన్నీ చేయడం సాధ్యం కాదన్న భావన అధికార వర్గాల్లో ఉంటుంది.
తిరుమల అంటే ఎంత కీలకమైన పోస్టింగ్ ఉండే ప్రాంతమో అధికారులకు తెలుసు. అదే సమయంలో అక్కడి పదవులకు ఎంత డిమాండ్ ఉంటుందో టీటీడీ చైర్మన్ , సభ్యులకు తెలుసు. ఆ ఒత్తిళ్లను తట్టుకునేలా తమకు ప్రాధాన్యత ఉండాలని ఎవరికి వారు కోరుకుంటారు. కానీ అన్ని వేళలా సాధ్యం కాదు. అందుకే అటు అధికారులు.. ఇటు బోర్డు మధ్య వివాదాలు వస్తున్నాయి. వాటిని వీలైనంత వరకూ బయటకు రాకుండా పరిష్కరించుకోవాలి కానీ.. తమ మాటలకు విలువ ఇవ్వడంలేదని బోర్డు సభ్యులు మీడియాకు లీకులు ఇస్తే.. టీటీడీని పలుచన చేసుకున్నట్లే.