రఘురామకృష్ణరాజుకు స్పీకర్ కార్యాలయం నోటీసులు జారీ చేసింది. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతలు చేసిన ఫిర్యాదు మేరకు ఈ నిర్ణయం తీసుకుంది. పార్టీ ధిక్కరణ ఆరోపణలపై సంజాయిషీ కోరింది. దీంతో వైసీపీ నేతల సంబరాలకు అంతే లేకుండా పోయింది. ఆయనపై అనర్హతా వేటుకు సమయం దగ్గర పడిందని హోరెత్తిస్తున్నారు. కానీ ఇక్కడ రఘురామకృష్ణరాజుతో పాటు… ఇద్దరు తృణమూల్ ఎంపీలకు కూడా నోటీసులు జారీ అయ్యాయి. వారిద్దరూ.. బెంగాల్లో ఎన్నికలకు ముందు బీజేపీలో చేరారు. వారిలో ఒకరి ప్రస్తుతం బెంగాల్లో బీజేపీని నడిపిస్తున్న సువేందు అధికారి .. సమీప పంధువు శిశిర్ అధికారి.
బీజేపీలో చేరిన ఆ ఇద్దరు ఎంపీలతో రాజీనామా చేయించి.. ప్రత్యేకంగా ఎన్నికలకు వెళ్లే ధైర్యం బీజేపీకి లేదు. అందుకే.., వారిపై అనర్హతా వేటు వేయడం అనేది సాధ్యం కాకపోవచ్చని చెబుతున్నారు. నిజం చెప్పాలంటే… నేరుగా పార్టీ ధిక్కరణకు పాల్పడింది తృణమూల్ ఎంపీలే. బీజేపీలో చేరి.. ఆ పార్టీ విజయానికి కృషి చేశారు. వేస్తే గీస్తే వారిపై అనర్హతా వేటు వేయాలి. కానీ వైసీపీ ఎంపీ రఘురామకృష్ణరాజు ఏ పార్టీలోనూ చేరలేదు. ఆయన పార్టీ నిర్ణయాలను మాత్రమే ధిక్కరిస్తున్నారు. ఆయన తాను ప్రజాస్వామ్య యుతంగా వ్యవహరిస్తున్నానని వాదిస్తున్నారు. సాంకేతికంగా రఘురామకృష్ణరాజుది పార్టీ ఫిరాయింపు కాదు. కానీ.. బీజేపీలో చేరిన ఇద్దరు తృణమూల్ ఎంపీలది మాత్రం ఫిరాయింపే.
రఘురామకృష్ణరాజుపై వేటు వేసి.. తమ పార్టీలో చేరిన ఇద్దరు ఎంపీలను బీజేపీ .. పార్టీ ధిక్కరించలేదని చెప్పే అవకాశం లేదు. వారిపై వేటు వేయకుండా రఘురామకృష్ణరాజుపై నిర్ణయం తీసుకునే చాన్స్ కూడా లేదు. దీంతో.. రఘురామకృష్ణరాజుకు అటు న్యాయపరమైన సపోర్ట్‌తో పాటు.. ఇటు బీజేపీ రాజకీయాలు కూడా కలసి వస్తున్నాయంటున్నారు. బెంగాల్లో బీజేపీ ఉపఎన్నికలకు వెళ్లే అవకాశాలు మరో మార్గంలో కూడా లేవు. ఇప్పుడు అక్కడ ఎలాంటి ఉపఎన్నికలు రాకూడదన్న పట్టుదలతో బీజేపీ ఉంది, ఎందుకంటే.. మమతా బెనర్జీ ఎమ్మెల్యేగా గెలవాల్సి ఉంది మరి..!