ఇందుకూరి రఘురామరాజు అనే ఎమ్మెల్సీపై మండలి చైర్మన్ అనర్హతా వేటు వేశారు. ఆయన టీడీపీలో చేరలేదు. టీడీపీకి ప్రచారం చేయలేదు. విప్ ఉల్లంఘించలేదు. అయినా వేటు వేశారు. దీనికి కారణం ఆయన భార్య టీడీపీలో చేరడం. టీడీపీకి చెందిన మాజీ ఎమ్మెల్యేతో కలిసి ఓ కార్యక్రమంలో పాల్గొనడం. ఇలాంటి వాటికే అనర్హతా వేటు వేస్తారా అంటే.. వేస్తారు. కోర్టుల్లో నిలబడవని తెలిసినా… తమ పంతం నెగ్గించుకోవడానికి… వేస్తారు . అదే చేశారు.
పార్టీ ఫిరాయింపుల నిరోధక చట్టం ప్రకారం అధికారికంగా పార్టీ మారితేనో లేకపోతే విప్ ఉల్లంఘిస్తేనో వేటు వేస్తారు. అది కూడా పూర్తి స్థాయిలో విచారణ జరిపి.. వివరణ తీసుకున్న తర్వాతనే. కానీ అసెంబ్లీ ఎన్నికల్లో ఫలితాలు తేడా వస్తే ఏమీ చేయలేమన్న ఉద్దేశంతో రాత్రికి రాత్రే ఆయనపై అనర్హతా వేటు వేశారు. ఎన్నికలకు ముందు రఘురాజు భార్యతో సహా ఆయన వర్గీయులంతా టీడీపీలో చేరిపోయారు. బొత్స సత్యనారాయణ కుట్రలు చేయడం… ఎన్నికల్లో వైసీపీ గెలిచే పరిస్థితి లేదని భావించి వారు పార్టీ మారిపోయారు.
శృంగవరపు కోట నియోజకవర్గంలో రఘురాజుకు మంచి పట్టు ఉంది. ఆయన పార్టీ మారిపోవడం వల్ల వైసీపీ అక్కడ ఓడిపోవడంతో పాటు… విశాఖపట్నం లోక్ సభ లోనూ వెనుకబడిపోతుందన్న అభిప్రాయం నెలకొంది. దీంతో బొత్స సత్యనారాయణ ఆయనపై అనర్హతా వేటు వేయించడానికి కసరత్తు చేశారు. నోటీసులు ఇచ్చినా వివరణ రాలేదన్న కారణం చెప్పి వేటు వేసేశారు.